PM Modi: గూగుల్ టు ఎన్విడియా.. 15 మంది సీఈవోలతో ప్రధాని భేటీ

by Shamantha N |   ( Updated:2024-09-23 04:15:22.0  )
PM Modi: గూగుల్ టు ఎన్విడియా.. 15 మంది సీఈవోలతో ప్రధాని భేటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగ్గజ టెక్ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. న్యూయార్క్ లోని ఓ హెటల్ లో మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈవో శంతను నారాయణ్‌, ఎన్విడియా సీఈవో జెన్‌సెన్‌ హాంగ్‌ సహా 15 కంపెనీల సీఈవోలు ఈ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోను మోడీ సోషల్ మీడియాలో ‘ఎక్స్‌’ లో పోస్టు చేశారు. సీఈవోలతో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ తదితర అంశాల గురించి చర్చించామని తెలిపారు. సాంకేతికత, ఆవిష్కరణలు సహా పలు అంశాలపై చర్చలు జరిపామన్నారు. ఈ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి గురించి మాట్లాడమన్నారు. భారత్ పట్ల అపారమైన ఆశావాదాన్ని చూసినందుకు సంతోషిస్తున్నానని మోడీ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్ టెక్నాలజీలతో సహా అత్యాధునిక రంగాలపై రౌండ్ టేబుల్ దృష్టి సారించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటనలో తెలిపింది.

ద్వైపాక్షిక చర్చలు

మూడు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన మోడీ క్వాడ్‌ దేశాల సదస్సులో పాల్గొన్నారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఇక, ఈనెల 23న న్యూయార్క్‌లోని యూఎన్ జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’నుద్దేశించి ప్రసంగించనున్నారు. అంతేకాకుండా పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌తో ప్రధాని మోడీ (Narendra Modi) సమావేశమయ్యారు. ఈసందర్భంగా గాజా (Gaza)లో జరుగుతున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ మద్దతు అందిస్తుందని తెలిపారు. అంతకుముందు నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ, కువైట్‌ యువరాజు షేక్‌ సబాహ్‌ ఖలేద్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ ముబారక్‌ అల్‌ సబాతోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

Advertisement

Next Story