Tesla: టెస్లా భారత మార్కెట్లోకి రావాలంటే పోటీ తప్పదా!

by S Gopi |
Tesla: టెస్లా భారత మార్కెట్లోకి రావాలంటే పోటీ తప్పదా!
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొన్నేళ్లుగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న టెస్లాకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో పాటు ట్రంప్ 2.0లో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసే స్థాయిలో మస్క్ ఉన్నారు. దీంతో భారత మార్కెట్లో ఈవీ తయారీ కంపెనీ టెస్లా రాకపై మరోసారి చర్చ మొదలైంది. భారత ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న ట్రంప్ అధ్యక్షుడిగా టెస్లాకు మరిన్ని రాయితీలు వచ్చేలా అమెరికా ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే, భారత ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) రంగం ఇటీవల అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఈవీలతో పాటు బ్యాటరీ వ్యాపారం కూడా పుంజుకుంటోంది. ప్యాసింజర్ ఈవీ కార్లు వరుసగా మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ వారంలోనే మహీంద్రా తన రెండు ఎస్‌యూవీలను లాంచ్ చేసింది. అధిక బ్యాటరీతో ఒక్క ఛార్జింగ్‌తో 450-500 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలిగే బీఈ6ఈ, ఎక్స్ఈవీ 9ఈలను తీసుకొచ్చింది. పైగా కేవలం 20 నిమిషాల్లో 20-80 శాతం బ్యాటరీ ఛార్జ్ అయ్యే సామర్థ్యంతో వీటిని పరిచయం చేసింది. ధరలు రూ. 19 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. మరోవైపు దేశీయ ఈవీ రంగంలో సగానికి పైగా వాటాతో ముందంజలో ఉన్న టాటా సైతం వేగంగా కొత్త మోడళ్లను తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే పోటీ తీవ్రంగా ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed