Harish Rao : ఆ జిల్లా రైతుల ఆత్మహత్యలపై సర్కార్ స్పందించాలి : హరీష్ రావు డిమాండ్

by Ramesh N |
Harish Rao : ఆ జిల్లా రైతుల ఆత్మహత్యలపై సర్కార్ స్పందించాలి : హరీష్ రావు డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముగ్గురు మంత్రులున్న జిల్లాలో నెలలో 5 రైతుల ఆత్మహత్య ప్రయత్నాలా? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఇద్దరు మరణించడం తీవ్రమైన విషయమని బుధవారం ట్విట్టర్ వేదిగకగా పోస్ట్ చేశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం సహా రాష్ట్ర కేబినెట్‌ లోని ముగ్గురు మంత్రులున్న జిల్లాలోనే రైతులకు ఈ దుస్థితి ఉందంటే రాష్ట్రంలో రైతుల తీరు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ సర్కారు రైతుల సమస్యలను తీర్చేందుకు ఎలాంటి సహాయం చేయకపోగా వారిని కొత్త సమస్యల్లోకి నెట్టివేస్తోందన్నారు.

ఇది ఏమాత్రం క్షమార్హం కాదని, రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మాటలకు పరిమితం అయిందని విమర్శించారు. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని, ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించి కనీసం వారి కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరగకుండా రైతులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఖమ్మం జిల్లాలో గత నెల రోజులుగా 5 రైతులు ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. ఇద్దరు చనిపోయారు. ముగ్గురు చికిత్స పొంది బయటపడ్డారని హరీష్ రావు పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story