ఆ ఒక్క పనిచేస్తే కోడ్ వచ్చినా గ్యారంటీలు అమలు చేయొచ్చు: హరీష్ రావు

by GSrikanth |
ఆ ఒక్క పనిచేస్తే కోడ్ వచ్చినా గ్యారంటీలు అమలు చేయొచ్చు: హరీష్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. వంద రోజుల్లో గ్యారంటీలన్నీ అమలు చేస్తామని చెప్పారని.. వచ్చే ఏడాది మార్చి 17తో వంద రోజులు పర్తవుతాయని వెల్లడించారు. అయితే, ఈ లోపే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని.. ఎన్నికల కోడ్ పేరుతో గ్యారంటీల అమలును జాప్యం చేయొద్దని అన్నారు.

ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల చేస్తే కోడ్ అడ్డొచ్చిన అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. తాము జిల్లాల్లో పర్యటించినప్పుడు అనేక మంది రైతులు తమకు ఇంకా రైతుబంధు సాయం అందలేదని చెబుతున్నారని.. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం గ్యారంటీలకు సంబంధించి ఏం చేసినా ఫిబ్రవరి 20వ తేదీ లోగానే చేయాలని.. లేకపోతే కోడ్ వచ్చి అన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయే అవకాశం ఉందని గుర్తుచేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుందని అన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకపోతే అన్నిటికీ కోతలు తప్పవని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed