Harish Rao: అసెంబ్లీ కౌరవ సభలా ఉంది.. అంతిమ విజయం పాండవులదే: హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు

by Shiva |
Harish Rao: అసెంబ్లీ కౌరవ సభలా ఉంది.. అంతిమ విజయం పాండవులదే: హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని.. ఏది ఏమైనా అంతిమ విజయం పాండువులదేనని మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా ఒక ముఖ్యమైన అంశంపై ప్రధాన ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడుతారని అడిగి అవకాశం ఇచ్చే సాంప్రదాయం సభలో ఉందని గుర్తు చేశారు. అలా కాకుండా సభ ఓ కౌరవ సభను తలపిస్తోందని కామెంట్ చేశారు. సభా, సాంప్రదాయాలను అధికారం పక్షం తుంగలో తొక్కినందుకు తాను నిరసన వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న అన్ని విషయాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, సమయం వచ్చిన నాడు వారే కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెబుతారని ఫైర్ అయ్యారు.

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నాయని హరీష్‌రావు అన్నారు. 2014లోనే నాటి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారనే విషయాన్ని గుర్తు చేశారు. ఆ తీర్మానం కాపీని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారని పేర్కొన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ విషయంలో మొండిగా వ్యవహరించిందని, చాలామంది మాదిగ సోదరులు అమరులు అయ్యారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంశంతో పాటు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన స్కిల్ ఇండియా వర్సిటీ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మద్దతు తెలుపుతున్నామని అన్నారు. నిన్న, ఈ రోజు సభ జరిగిన తీరు తమ హృదయాలను ఎంతగానో గాయపరిచిందని, తమ మహిళా ఎమ్మెల్యేలకు సభా నాయకుడు, ఉప నాయకుడు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story