‘ప్రజావాణి’ నోడల్ అధికారిగా హరిచందన

by GSrikanth |
‘ప్రజావాణి’ నోడల్ అధికారిగా హరిచందన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజాభవన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి తగిన పరిష్కారం కనుగొనడంపై దృష్టి సారించింది. ప్రతీ వారం రెండు రోజుల పాటు ప్రజా భవన్‌లో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. మంత్రులు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం ప్రోగ్రామ్‌కు నోడల్ అధికారిగా హరిచందనను నియమించింది. ప్రస్తుతం ఆయుష్ డిపార్టుమెంటు డైరెక్టర్‌గా ఉన్న 2010 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి హరిచందనను నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికి తోడు ఆమె మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ప్రజావాణి ప్రారంభించిన తర్వాత రెండు సందర్భాల్లో స్వయంగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. ఆ సమయంలో సీఎంఓ సెక్రటరీగా ఉన్న శేషాద్రితో పాటు హరిచందన కూడా అటెండ్ అయ్యారు. ప్రజల నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి యాక్టివ్‌గా పనిచేసే అధికారులను గుర్తించిన ప్రభుత్వం చివరకు హరిచందనను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. దీనికి తోడు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగంలో సెక్రటరీగా పనిచేస్తున్న 2004 బ్యాచ్‌కు చెందిన కె.నిర్మలను జనరల్ అడ్మినిస్ట్రేషన్ (జీఏడీ) విభాగంలోని జీపీఎం ఏఆర్‌టీ వింగ్‌కు బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటివరకూ ఆ బాధ్యతలను శేషాద్రి నిర్వహిస్తుండగా ఇక నుంచి నిర్మల పర్యవేక్షించనున్నారు.

Advertisement

Next Story