ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి ఉపాధికి గల్ఫ్ బాట

by Gantepaka Srikanth |
ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి ఉపాధికి గల్ఫ్ బాట
X

జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామానికి చెందిన బైర రంజిత్ మూడేండ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని తగ్గ వేతనం దొరకలేదు. ఈ బెంగతో మనోవేదన చెందిన అతను అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఏప్రిల్ 28న తాను ఉంటున్న రూమ్‌లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంజిత్ నిరుపేద కుటుంబం కావడంతో దాతల ద్వారా సుమారు రూ.65 వేలు సేకరించి, గల్ఫ్ ప్రతినిధుల సహకారంతో అతని మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో ప్రస్తుతం ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన ముబీన్.. కంప్యూటర్ కోర్సు పూర్తి చేసి గల్ఫ్ వెళ్లాడు. అక్కడే ఓ కంపెనీలో హార్డ్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఒక రోజు కంపెనీలో వర్క్ చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. సుమారు వారం - పది రోజుల పాటు అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందిన ముబీన్ ఫలితం లేక మృతి చెందాడు. మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు డబ్బులు లేక, కంపెనీ సహాయం నామమాత్రంగా ఉండడంతో అక్కడే ఉన్న బంధువులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ముబీన్‌కు పెళ్లి జరిగి కనీసం మూడెండ్లు కూడా గడవ మందే చనిపోవడంతో ఆయన కుటుంబం వీధిన పడింది. ఆయనకు చిన్న పాప ఉండటంతో కుటుంబ పోషణ భారమై ఆ ఫ్యామిలీ అనేక ఇబ్బందులు పడుతున్నది.

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన కందెలా వెంకటి 20 ఏండ్లుగా సౌదీలో ఉంటున్నాడు. కార్మికుడిగా పని చేస్తున్న అతనికి కంపెనీ తక్కువ జీతం ఇస్తున్నది. అక్కడి ఖర్చులు, ఇంటికి డబ్బులు పంపించడం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో అప్పులు పెరిగి పోయాయి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక వెంకటి జూన్ 6న సౌదీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. సమారు నెల నిరీక్షణ తర్వాత రూ.లక్ష ఖర్చు చేస్తే అతని మృతదేహం స్వగ్రామానికి వచ్చింది. వెంకటికు భార్య కొడుకు, కూతురు ఉన్నారు. ఇంటి పెద్ద చనిపోవడంతో ఆ కుటుంబం అనాథగా మారింది. ఇదే జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన నిమ్మ రాజశేఖర్ సౌదీలో డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఏప్రిల్ 3వ తేదీన గుండెపోటు రావడంతో మృతి చెందాడు. రాజశేఖర్ మృతదేహం 24 రోజుల తర్వాత స్వగ్రామానికి చేరింది.

పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న తెలంగాణ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా ఉన్నాయి. సరైన పని, వేతనాలు, వసతులు లేక సతమతం అవుతున్నారు. అప్పు చేసి విదేశాలకు వెళ్తే.. అక్కడికి వెళ్లాక డబ్బులు చాలక.. వచ్చిన డబ్బులు ఇంటికి పంపలేక, అప్పుల వారికి చెల్లించక లేక మనో వేదనకు గురవుతున్నారు. మనోవేదనకు గురవుతూ అనారోగ్యాల పాలవుతున్నారు. కొందరు గుండెపోటుతో చనిపోతుండగా మరి కొందరు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకూ నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో వైపు కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న ఏజెంట్లు మంచి ఉద్యోగం, సాలరీ ఇప్పిస్తామని చెప్పి గల్ఫ్ కంట్రీస్‌కు తీసుకెళ్లి.. లేబర్ పనిలో పెట్టిస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేసి వెళ్లిన తర్వాత తిరిగి రాలేక.. తమ బాధను ఎవరికీ చెప్పుకోలేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ గోసలపై ప్రత్యేక కథనం. = మహమ్మద్ నిసార్

ఏయే దేశాల్లో ఎంత మంది..

భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గల్ఫ్ దేశాల్లో సుమారుగా 90 లక్షల మంది భారతీయులు ఉన్నారు. సౌదీ అరేబియాలో 24,65,464 మంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 35,54,274 మంది, కువైట్‌లో 9,24,687 మంది, ఖతర్‌లో 8,44,499 మంది, ఒమన్‌లో 6,53,500 మంది, బహ్రెయిన్‌లో 3,08,662 మంది భారత పౌరులు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఇంకా లక్షలాది మంది విజిట్ వీసాతో వచ్చి అక్కడ స్థిరపడిన వారూ అనేకంగా ఉన్నారని తెలుస్తున్నది.

తెలంగాణ నుంచి 10 నుంచి 15 లక్షలు మంది

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మెదక్ జిల్లాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోసం దుబయ్, సౌదీ అరెబియా, ఖతార్, కువైట్, బెహ్రెయిన్, మలేషియా, రియాద్ వంటి దేశాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్తున్నారు. రాష్ట్రం నుంచి సుమారు 10 నుంచి 15 లక్షల మంది మంది తెలంగాణ వాసులు గల్ఫ్ దేశాల్లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక్కడి నుంచి వెళ్లిన వారిలో అనేక మంది లేబర్లుగా పని చేస్తున్నారు.

కఫాలా పద్ధతిలో రిక్రూట్‌మెంట్

తెలంగాణ నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి యువత నిర్మాణం, ఆరోగ్యం, తయారీ, రవాణా, ఆతిథ్యం, సేవా రంగాల్లో ఉద్యోగాల కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. వీటిలో చాలా వరకు బ్లూ కాలర్ - మాన్యువల్ లేబర్ ఉద్యోగాలే ఉంటున్నాయి. అరబ్ కంట్రీస్‌లో పని చేసేందుకు వెళ్లాలంటే ప్రతి ఉద్యోగానికీ నిర్దిష్ట విద్యార్హత లేదా కోర్సు ఉండాల్సిన అవసరం లేదు. పని కోసం అక్కడికి వెళ్లే వ్యక్తులు నిర్దిష్ట వర్క్ వీసాలపై వెళ్తారు. తరచుగా వలస కూలీలు ఆ దేశాలలోని కఫాలా విధానం ప్రకారం రిక్రూట్ అవుతారు. ఇందులో వీసా, ప్రయాణం, వసతి, ఆహార ఖర్చులు యజమాని (కఫీల్) భరిస్తారు. పని విషయంలో కఫీల్, ఏజెంట్ మధ్య ఒప్పందం ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం.. కార్మికుల పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన పత్రాలు యజమాని దగ్గరే ఉంటాయి. దీంతో కార్మికులు తమ తమ దేశాలకు ఇష్టానుసారంగా వెళ్లే అవకాశం ఉండదు. ఒక ఉద్యోగం నుంచి మరో దానికి మారే అవకాశం సైతం ఉండదు. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. అంతే వేతనం, అన్నే ఏండ్లు అతని దగ్గర పని చేయాల్సి ఉంటుంది. ఈ విధానంతో గల్ఫ్‌కు వెళ్లే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఏజెంట్ల మోసాలతో ఏడారిలో..

ఎంతో కొంత నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న అనేక మంది ఏజెంట్లు వీరిని మోసం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మనం ఎన్నో పత్రికలు, సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇటీవలే ఆర్మూర్‌కు చెందిన షేర్ రాజ్ కుమార్, పుప్పాల వినోద్‌లు గల్ఫ్ ఏంజెట్ చేతిలో మోసపోయారు. ఇద్దరి నుంచి చెరి రూ.2.5 లక్షలు తీసుకున్న ఏజెంట్ జాబ్ విసా ఇప్పిస్తానని చెప్పి వారిని విజిట్ వీసాపై సౌదీ అరెబియాకు తీసుకెళ్లాడు. అఖామా ఇప్పించాలని కోరితే అదనంగా డబ్బు కట్టాలని వేధిస్తున్నట్టు వారు వాపోయారు. తమను ఇండియాకు పంపించాలన్నా కపిల్ పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మంచి ఉద్యోగాలు ఉన్నాయని, వసతి, భోజనం సౌకర్యం ఉంటుందని, ఒవర్ టైం చేసుకుంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చని ఆశ చూపుతూ ఏజెంట్లు ఇక్కడి యువతను మోసం చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లాక ఏడారిలో పశువులు కాసే పనిలో, లేబర్లుగా, హోటళ్లు, ఇంటి పని, తోటలు, నిర్మాణర రంగం, తదితర పనుల్లో పెట్టిస్తున్నారు. చేసేదేమీ లేక కార్మికులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇంకో వైపు లేని ఉద్యోగాలను క్రియేట్ చేస్తున్న ఏంజెట్లు వారిని విజిట్ వీసాలపై గల్ఫ్ కంట్రీస్‌కు తీసుకెళ్లి అక్కడ వదిలేసిన ఘటనలూ అనేకంగా ఉన్నాయి. విదేశాల్లో తమను ఆదుకునే వారు లేక.. గడువు ముగిసినా అక్కడే ఉండడంతో పోలీసులకు చిక్కి వందలాది మంది జైళ్లలో మగ్గుతున్నారు.

ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు

కోటి ఆశలతో గల్ఫ్ బాట పట్టిన కార్మికులు చివరికి శవపేటికల్లో ఇంటికి చేరుకుంటున్నారు. అక్కడ సరైన పని లేక, వస్తున్న వేతనం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి వస్తే.. లాభం లేకుండా పోయిందని, ఓ వైపు అప్పుల వారి బాధలు, మరో వైపు పని ఒత్తిడితో కార్మికులు గల్ఫ్ దేశాల్లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పని చేస్తూనే గుండెపోటుతో చనిపోతున్న ఘటనలూ ఉన్నాయి. చనిపోయిన కార్మికుల మృతదేహాలు తీసుకొచ్చేందుకూ ఎంబసీ, టికెట్, హాస్పిటల్ పోస్టుమార్టం రిపోర్టు.. ఇలా అనేక నిబంధనలతో సుమారు 15 నుంచి నెల రోజుల పాటు సమయం పడుతుంది. అయితే గల్ఫ్ వెళ్తున్న కార్మికుల నుంచి ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విదేశీ మారం రూపంలో రూ.కోట్లు వస్తున్నాయి. అయినా కార్మికుల సంక్షేమం గురించి సరైన చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి.

వెల్ఫేర్ పాలసీ ఏర్పాటుకు ప్రభుత్వం కార్యాచరణ

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కేరళ తరహా పాలసీ రూపొందించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనూ అనేక మంది దీనిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమ పాలసీ ఏర్పాటుపై ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ పాలసీ ప్రకారం.. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందే అవకాశం ఉంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేసేందుకు ఓ అడ్వయిజరీ కమిటీ సైతం ఏర్పాటు చేయనున్నది. వారి ఫిర్యాదులను స్వీకరించేందుకు ప్రజా భవన్‌లో ప్రవాసీ ప్రజావాణి పేరుతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో చదువుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి

ఉపాధి కోసం రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల బాట పట్టి అక్కడ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవలే హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ప్రవాసీ ప్రజావాణి పేరుతో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. దీనికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి గ్రీవెన్స్ నిర్వహించారు. మొదటి రోజునే పెద్ద ఎత్తున గల్ఫ్ బాధితులు వచ్చి తమ సమస్యలు విన్నవించుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు తలా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, కార్మికుల పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా గురుకులాల్లో అడ్మిషన్లు కల్పిస్తున్నామని, గల్ఫ్ కార్మికుల కోసం ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో అడ్వైజరీ కమిటీ సైతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు.

ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి: స్వదేశ్ పరికిపండ్ల, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, గల్ప్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. దీనికి ప్రతి యేటా బడ్జెట్ కేటాయించాలి. గల్ప్‌లో ఏండ్ల తరబడిగా పని చేసి సొంతూర్లకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్మికులకు స్వయం ఉపాధి రంగాల్లో అవకాశం కల్పించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలి. వివిధ కారణాలతో గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్న, ఇతర రీజన్స్ పరిష్కరించేందుకు న్యాయ సహాయం కోసం ప్రవాసీ భవన్ ఏర్పాటు చేయాలి. వివిధ కారణాలతో గల్ఫ్‌లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఇది కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిప్పటి నుంచి ఇవ్వాలి. ఎన్‌ఆర్ఐలను ప్రోత్సహించాలి.

Advertisement

Next Story