గవర్నర్‌పై ఆ ఫార్ములాకు గులాబీబాస్ స్కెచ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-27 05:20:46.0  )
గవర్నర్‌పై ఆ ఫార్ములాకు గులాబీబాస్ స్కెచ్!
X

దిశ, వెబ్‌డెస్క్: గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకల్లో చేసిన ప్రసంగం దానిపై బీఆర్ఎస్ నాయకుల రియాక్షన్ ఆ పార్టీకి కలిసిరానుందా.. మహిళా గవర్నర్‌పై గులాబీ బాస్ ఎలా ముందుకు వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ఫార్ములానే ఇక్కడ అమలు చేయనున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని గణతంత్ర వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు అన్నారు. మంత్రులు తలసాని, ఎర్రబెల్లి, స్పీకర్ పోచారం, కేకే, గుత్తా, ఎమ్మెల్సీ కవిత సహా ముఖ్య నేతలంతా గవర్నర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.

గతంలోనూ గవర్నర్, సర్కారు మధ్య విభేదాలు చోటు చేసుకున్న తమిళిసై కేసీఆర్‌పై కాకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు. నిన్న తెలంగాణ, పుదుచ్చేరిలో మాట్లాడిన గవర్నర్ నేరుగా సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కామెంట్ చేయడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది.

ఆ ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్!

తనను ఎదిరించే వారిని ఉపేక్షించని సీఎం కేసీఆర్ గవర్నర్‌పై సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. తమిళనాడు ఫార్ములానే తెలంగాణలో అమలు చేయాలని గులాబీ బాస్ ఆలోచలో ఉన్నట్లు తెలిసింది. గవర్నర్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదుతో పాటు ప్రజాఉద్యమానికి తమిళనాడులోని అధికారపక్షం సిద్ధమవుతుండగా దానినే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిపై ఇప్పటికే మంత్రులు కామెంట్ చేస్తుండగా నేరుగా సీఎం కేసీఆర్ గవర్నర్ల వ్యవహరం.. బీజేపీ అనుసరిస్తున్న తీరుపై మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ప్రెస్ మీట్‌‌లలో ప్రతిసారి బీజేపీపై నిప్పులు చెరిగే కేసీఆర్ ఈ సారి గవర్నర్ల అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీని ఇరకాటంలో పెట్టే స్కెచ్‌పై ఫోకస్ చేసినట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్ల తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా బీజేపీ వైఖరిని తెలిపేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆ పార్టీకి కలిసిరానుందా..

మహిళా గవర్నర్ తమిళిసై పై రాష్ట్ర మంత్రుల దూకుడు వ్యాఖ్యలతో పాటు ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు తమకు కలిసివస్తాయని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే మహిళల సమస్యలపై రాజ్ భవన్‌లో ప్రజాదర్భార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గవర్నర్ పట్ల మహిళల్లో పాజిటివ్ టాక్ ఉంది. మహిళా నేతల్లో రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత తర్వాత ఆ స్థాయిలో ఎవరికీ గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో తనదైన శైలితో గవర్నర్ తమిళిసై మహిళల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ మహిళా గవర్నర్‌పై బీఆర్ఎస్ మూకుమ్మడి దాడితో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తమిళనాడు గవర్నర్‌ రవికి సీఎం స్టాలిన్‌కు తీవ్ర విబేధాలు ఉన్నా ఆయన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. కేరళ సీఎం పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లకు సైతం గవర్నర్లతో వివాదాలు నెలకొన్న వారు గణతంత్ర వేడుకలకు హాజరవడంతో పాటు ఎట్ హోం కార్యక్రమాలకు హాజరై తమ హుందాతనాన్ని చాటుతున్నారు. రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా సీన్ కనిపిస్తోంది. రాజకీయాలకు గణతంత్ర వేడుకలకు మినహాయింపు ఇవ్వాల్సి ఉండగా కేసీఆర్ మాత్రం తన పంథాలోనే ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎటు దారి తీస్తుందోననే ఆసక్తి నెలకొంది.

Also Read...

మహిళలను ఓట్లడిగితే చెప్పుతో కొడతారు : బల్మూరి వెంకట్

Advertisement

Next Story