కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు.. శేరిలింగంపల్లిలో రెండుగా చీలిన నేతలు

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-07 06:30:41.0  )
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు.. శేరిలింగంపల్లిలో రెండుగా చీలిన నేతలు
X

దిశ, శేరిలింగంపల్లి : కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడప్పుడే గ్రూప్ తగాదాలకు తెరపడేలా లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు, ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ శ్రేణులు, కష్టమో నష్టమో పార్టీ జెండాను భుజానికెత్తుకుని ముందు నడిచిన నాయకులు... ఇప్పుడు వచ్చిన నేతలకు కాని వారం అయ్యామా... అంటూ తమ గళమెత్తుతున్నారు. కష్టకాలంలో పార్టీని అట్టిపెట్టుకుని ఉండి, కార్యకర్తలను కాపాడుకున్న తమకు కనీస గుర్తింపు దక్కడం లేదని, ఇలాంటి తరుణంలో తాము ఎలా కొత్త నాయకుడితో కలిసి నడుస్తామంటూ అసమ్మతి రాగాలు వినిపిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గళాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపుపై నిన్నా మొన్నటి వరకు జెరిపేటి జైపాల్, మారబోయిన రఘునాథ్ యాదవ్‌లు తమ అసమ్మతిని వ్యక్తం చేయగా.. తాజాగా పీసీసీ ప్రతినిధి సత్యంరావు ఈ జాబితాలో చేరారు. ఏకంగా ఆయన మరో అడుగు ముందుకేసి తన అనుచరులతో సమావేశం పెట్టి త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని, అధిష్టానం తమకు అన్యాయం చేసిందంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

అందరూ అలకబూనడంతో..

ఏ పార్టీలో అయినా అలకలు, బుజ్జగింపులు కామన్‌గా ఉండేవే.. కానీ వాటికి కొంత సమయం ఉంటుంది. చాలా వరకు అభ్యర్థి ప్రకటన వరకు అలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టి ఒకే పార్టీలో ఉండి పార్టీ కోసం పనిచేస్తున్నా భిన్నాభిప్రాయాలు ఉన్నవారిని పార్టీ అధిష్ఠానాలు కూర్చోబెట్టి సర్ది చెప్పడం, కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలని, పార్టీ అభ్యర్థి గెలుపుకోసం పనిచేయాలంటూ పార్టీ పెద్దలు నచ్చచెప్పడం చూస్తూనే ఉంటాం. కానీ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్లను, టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు.

శేరిలింగంపల్లి టికెట్ కోసం శతవిధాల ప్రయత్నాలు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని, చివరి నిమిషం వరకు ఆశపెట్టుకున్న జెరిపేటి జైపాల్‌కు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. పార్టీ నిర్ణయం పట్ల తీవ్ర అసహనంతో ఉన్న జెరిపేటి జైపాల్ ఇంటికి మాజీ ఎంపీ మల్లురవి వచ్చి వెళ్లడం మిమహా చేసింది ఏమీ లేదని, ఆయనకు పార్టీ పదవులు, ఎమ్మెల్సీ అంశంపై కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని జెరిపేటి సన్నిహితులు చెబుతున్నారు. ఇక రఘునాథ్ యాదవ్ విషయంలోనూ అలాగే జరిగింది. హామీల సంగతి అటుంచితే కనీసం పార్టీ నుండి ఏ ఒక్క లీడర్ కూడా ఆయన వద్దకు వచ్చి బుజ్జగించి దాఖలాలు లేవు. వీరిద్దరు ఇలా ఉంటే సత్యంరావుది కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే. టికెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని సత్యంరావు అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు.

సత్యంరావు సంగతేంటి..?

శేరిలింగంపల్లి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణులను ఒకతాటిపైకి తీసుకువస్తూ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు సత్యంరావు. కాస్మోపాలిటన్ నియోజకవర్గంగా మారిన శేరిలింగంపల్లిలో కులాలకు, మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభిస్తుందని నమ్మకంతో పనిచేశారు. అందులో భాగంగా అటు రాష్ట్ర నాయకత్వంతో ఇటు నియోజకవర్గ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ముందుకు వెళ్లారు.

కానీ సమయానికి కొత్త అభ్యర్థి తెరపైకి వచ్చి టికెట్ దక్కించుకోవడం సత్యంరావు వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. టికెట్ దక్కించుకున్న అభ్యర్థి నేటికి సత్యంరావు వర్గీయులను పట్టించుకోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కోసం, సదరు అభ్యర్థి కోసం తామెలా పనిచేస్తాం అంటూ రెబల్ జెండా ఎగరవేస్తున్నారు. సత్యంరావు వర్గీయులంతా ఓ దఫా సమావేశం అయ్యి రానున్న ఎన్నికల్లో తమ కార్యాచరణ ఎలా ఉండబోతుందనే అంశంపై చర్చించారు. తాజాగా మంగళవారం మరోసారి కూడా సమావేశం అయి తమ తదుపరి కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు వారు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ నేతల తలోదారి..

ఈసారి ఎలాగైనా గెలవాలని, రాష్ట్రంలో అధికారంలోకి రావాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతుంటే శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేతలు మాత్రం కలిసికట్టుగా నడవలేక పోతున్నారు. ఉన్న నాయకుల మధ్య గ్రూప్ తగాదాలు మరింత అగాధం పెంచుతున్నాయి.

కాంగ్రెస్ అభ్యర్థితో ఇప్పటి వరకు శేరిలింగంపల్లి ఏ బ్లాక్ అధ్యక్షులు, మియాపూర్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ఇలియాస్ షరీఫ్, పీసీసీ మైనార్టీ రాష్ట్ర వైస్ చైర్మన్ జమీర్, నియోజకవర్గ సీనియర్ నాయకులు రవి గౌడ్ ( గచ్చిబౌలి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ), ఆవుల ప్రదీప్, రాగం శ్రీనివాస్ యాదవ్, కూకట్ పల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ బీరం ఇంద్రారెడ్డి, నియోజకవర్గ ఓబీసీ సెల్ జనరల్ సెక్రటరీ నర్సింహ్మా, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ జెనరల్ సెక్రటరీ ఖాజా, నియోజకవర్గ మైనార్టీ ప్రెసిడెంట్ జమీల్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు శాంసన్, మహిళా కాంగ్రెస్ కో ఆర్డినేటర్ పద్మిని ప్రియదర్శిని, మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, యూత్ కాంగ్రెస్ నాయకులు అఫ్రోజ్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్, లింగంపల్లి మైనార్టీ అధ్యక్షులు అక్బర్, భరత్ గాంధీరెడ్డి, అనిల్ రావు, కరుణాకర్ రెడ్డి, మేరాజ్, ప్రశాంత్ గౌడ్, జాన్ ఇలా చాలామంది నాయకులు ప్రస్తుత అభ్యర్థితో కలిసి నడిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది.

ఓ వైపు పార్టీలో కొత్తవారు చేరుతున్నారు అని ప్రచారం చేస్తున్న సమయంలో మరి పాత వారు, కార్పొరేటర్లుగా పోటీ చేసిన వారు, పార్టీ కోసం పనిచేసిన తమను ఎందుకు కలుపుకు పోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. తమదారిలో తాము వెళ్తామని, ఏదున్నా గాంధీ భవన్ లో తేల్చుకుంటామంటూ కాంగ్రెస్ నాయకులు తెగేసి చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed