యాదాద్రికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు.. కేసీఆర్ హర్షం

by GSrikanth |
యాదాద్రికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అవార్డు.. కేసీఆర్ హర్షం
X

దిశ, తెలంగాణ బ్యూరో: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022-25 సంవత్సరానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రధానం చేసే "గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్" (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు లభించింది. 13వ శతాబ్దానికి చెందిన లక్ష్మీ నరసింహ దేవాలయ స్వయంభూ పవిత్రతకు భంగం వాటిల్లకుండా, స్వయం భువుని ఏమాత్రం తాకకుండా ఆలయ ప్రాశస్త్యాన్ని కాపాడుతూ నిర్మాణం, ప్రత్యేక 'సూర్య వాహిక' ద్వారా ప్రధాన ఆలయంలోకి సహజ కాంతి ప్రసారం జరిగేలా ప్రత్యేక నిర్మాణం, ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ నిర్మాణాలను పూర్తిగా కృష్ణశిలతో నిర్మించడం, విస్తారమైన పచ్చదనం, అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు, భక్తుల అవసరాలకు సరిపోయే చెరువుల నిర్మాణం, వాహన పార్కింగ్ స్థలాల కేటాయింపు వంటి నిబంధనలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించింది. అవార్డు రావడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరి పుణ్య క్షేత్రానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడం సంతోషకరమని అన్నారు. స్వయం పాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమన్నారు. యాదగిరిగుట్ట పునర్నిర్మాణం, భారతీయ ఆధ్యాత్మిక పునురుజ్జీవన వైభవానికి నిదర్శనంగా నిలిచిందని కేసీఆర్ తెలిపారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులను 'ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్' ప్రశంసించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవమన్నారు.

Advertisement

Next Story