అక్రమ నిర్మాణల్లో కొనసాగుతున్న విద్యాసంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం?

by Gantepaka Srikanth |
అక్రమ నిర్మాణల్లో కొనసాగుతున్న విద్యాసంస్థలు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాలు, అనుమతి లేని కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్నది. పార్టీల నేతలు, సెలెబ్రేటీలనే తేడా లేకుండా సర్కారు యాక్షన్ తీసుకుంటున్నది. అయితే అక్రమ నిర్మాణాలు జాబితాలో పలు విద్యాసంస్థలు ఉన్నట్లు గుర్తించిన హైడ్రా.. వీటిపై విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. ఆక్రమణలని తేలితే కూల్చివేస్తామని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో.. అక్రమ నిర్మాణల్లో కొనసాగుతున్న విద్యాసంస్థలకు ఒక ఏడాది పాటు గ్రేస్ పీరియడ్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని..

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ఒక ఏడాది వరకు అవకాశం ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. విద్యాసంవత్సరం ముగిసే నాటికి విద్యార్థులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని, ఆ తర్వాత ఆయా కట్టడాలను వారే కూల్చివేయడమో? లేక హైడ్రాకు అప్పగించడమో చేయాలని కండీషన్ పెట్టాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. తమ భవనాలను కూల్చవద్దని ఇప్పటికే పలు విద్యాసంస్థల నుంచి సర్కారుకు వినతులు అందినట్లు తెలిసింది. దీంతో స్టూడెంట్స్ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం వరకు వారికి అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

హైడ్రాకు ఫిర్యాదులు

ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ప్రముఖ రాజకీయ వేత్తలకు చెందిన విద్యాసంస్థలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అందులో పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్శిటీ, మల్లారెడ్డికి చెందిన వర్సిటీ, ఒవైసీకి చెందిన విద్యాసంస్థలు ఉన్నాయని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. వీటిని కూల్చాలని సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతున్నది. అయితే అవి అక్రమ నిర్మాణాలా? లేదా? అన్న అంశంపై విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు తేలితే కూల్చివేత ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ కు ఇబ్బందులు కలగకూడదనే దృక్పథంతోనే విద్యాసంస్థలకు ఈ విద్యాసంవత్సరం గ్రేస్ పీరియడ్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

‘మర్రి’ కాలేజీలకు

కుత్బుల్లాపూర్ నియోజకకర్గం దుండిగల్ మున్సిపాలిటీలోని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటీ, ఏరోనాటికల్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కాలేజీలు చిన్నదామర చెరువును ఆక్రమించి చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్నదామర చెరువుకు సంబంధించి ఎనిమిది ఎకరాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని 2007లో హై కోర్టులో కేసు నమోదైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేయాలని 2018లో ఆదేశాలు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వ ప్లీడర్ శ్రీకాంత్ రెడ్డి, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు.

అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. వారం రోజుల తర్వాత కలెక్టర్ గౌతమ్ చిన్న దామర చెరువును పరిశీలించి, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఫిబ్రవరిలోనే ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉన్న షెడ్లు, పార్కింగ్, ప్లే గ్రౌండ్, కొన్ని శాశ్వత కట్టడాలను కూల్చివేశారు. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీంతో యాజమాన్యం మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. అకడమిక్ ఇయర్ నడుస్తుండడంతో కొంత సమయమివ్వాలని కోరింది. దీంతో కూల్చివేతలు ఆపాలని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్వర్వుల గడువు ముగియడంతో రెవెన్యూ అధికారులు సమాధానం ఇవ్వాలంటూ కాలేజీ యాజమాన్యానికి మళ్లీ నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed