వైద్యశాఖకు గుడ్ న్యూస్.. మెడికల్ కాలేజీల్లో 12 కోర్సుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్

by Nagaya |   ( Updated:2022-12-27 15:21:15.0  )
వైద్యశాఖకు గుడ్ న్యూస్.. మెడికల్ కాలేజీల్లో 12 కోర్సుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో తొలిసారిగా వైద్య విద్య అనుబంధ కోర్సులను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. మొత్తం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బీఎస్సీ అనుబంధ కోర్సులు ఈ ఏడాది విద్యా సంవత్సరం నుండి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ జీవో నెంబర్ 156ను విడుదల చేసింది. గాంధీ, కాకతీయ, రిమ్స్, ఉస్మానియా, నిజామాబాద్, సిద్ధిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయి.

రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలతో పాటు, వైద్య విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించగా, మరో రెండేళ్లలో జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేలా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య విద్య అనుబంధ సేవలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్సీ మొదటి ఏడాది, 12 వైద్య విద్య అనుబంధ కోర్సులు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం (2022-23) నుంచే ఈ కోర్సులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మూడేళ్ల కోర్సు మరియు ఒక సంవత్సరం ఇంటర్న్ షిప్ తో కలుపుకొని నాలుగేళ్ల కాల వ్యవధి ఉంటుంది.

అనస్థీషియా, ఆపరేషన్ థియేటర్, రెస్పిరేటరీ థెరపీ, రీనల్ డయాసిస్, న్యూరోసైన్స్, క్రిటికల్ కేర్, రేడియాలజీ అండ్ ఇమేజింగ్, ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ, మెడికల్ రికార్డ్స్ సైన్సెస్, ఆప్తోమెట్రిక్, కార్డియాక్ అండ్ కార్డియోవాస్క్యూలార్ టెక్నాలజీ కోర్సులు ఇందులో ఉన్నాయి. తాజా నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం 860 మంది లబ్ధి పొందుతారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయి.



Advertisement

Next Story