గవర్నర్ vs సర్కార్.. మళ్లీ జోరందుకున్న హాట్ కామెంట్స్

by GSrikanth |   ( Updated:2023-10-12 06:27:37.0  )
గవర్నర్ vs సర్కార్.. మళ్లీ జోరందుకున్న హాట్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్‌పై విమర్శల పర్వం మళ్ళీ ఊపందుకున్నది. పెండింగ్ బిల్లుల విషయంలో గతంలో ఓసారి మంత్రులు, గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో గవర్నర్ వ్యవస్థపైన విమర్శలు చేశారు. కొంతకాలం ఆ జగడం సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదని స్వయంగా గవర్నర్ కామెంట్ చేయడంతో మంత్రుల నుంచి మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. రాజ్‌భవన్ రాజకీయ భవన్‌గా మారిపోయిందంటూ గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. ఇప్పుడు ఏకంగా మంత్రి హరీశ్‌రావు.. ఆమెకు (గవర్నర్‌ను ఉద్దేశించి) ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావచ్చని, సిద్దిపేట నుంచి పోటీ చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు.

గతంలో ప్రోటోకాల్ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ కామెంట్స్ చేయగా, ఇప్పుడు సచివాలయం ఓపెనింగ్, అంబేద్కర్ విగ్రహావిష్కరణను ఉద్దేశించి ఆహ్వానం అందలేదని ఓపెన్‌గానే వ్యాఖ్యానించారు. తొలుత దీనికి మంత్రి జగదీశ్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రులు గంగుల కమలాకర్, హరీశ్‌రావు స్వరం పెంచారు. ఇంతకాలం గవర్నర్ వ్యవస్థ ఒక ‘రబ్బర్ స్టాంప్’ లాంటిదేననే అభిప్రాయం ఉండేది. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో రాజ్‌భవన్ ప్రమేయం లేకపోయినా కీలకమైన బిల్లుల విషయంలో ఆమోదం తప్పనిసరి కావడంతో ఇటీవలి కాలంలో ఆ ప్రాధాన్యత ప్రజలకు కూడా అర్థమయ్యేలా తెలిసొచ్చింది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం గొప్పదా?.. లేక నామినేటెడ్‌గా వచ్చిన గవర్నర్ వ్యవస్థ గొప్పదా అనే చర్చ తెరపైకి వచ్చింది.

సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాతనే పెండింగ్ బిల్లులపైన గవర్నర్ స్పందించాల్సి వచ్చిందని, దీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా చివరకు ప్రభుత్వానికే తిప్పి పంపడం అన్యాయమంటూ వ్యాఖ్యానించిన మంత్రులు ఆమెనే తప్పుపట్టారు. గవర్నర్‌కు ఎప్పుడ ఆహ్వానం ఇవ్వాలో ప్రభుత్వానికి తెలుసని, ప్రారంభోత్సవాలకు తప్పకుండా ఆహ్వానించాలన్న నిబంధన రాజ్యాంగంలో ఎక్కడా లేదని మంత్రులు వ్యాఖ్యానించారు. దీంతో ఇకపైన ఆమెకు ఇన్విటేషన్ పంపబోమని పరోక్షంకా సంకేతం ఇచ్చినట్లయింది. బిల్లులకు గవర్నర్ నుంచి ఆమోదం రాకపోవడంతో ప్రభుత్వ ప్రణాళికకు ఆయా అంశాల్లో బ్రేక్ పడినట్లయింది. అప్రాధాన్యం అనుకున్న రాజ్‌భవన్ ఇంపార్టెన్స్ ఇప్పుడు స్పష్టంగా తెలిసొచ్చినట్లయింది.

పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాలు మేరకే మంత్రులు ఒక్కసారిగా గవర్నర్‌పై విరుచుకుపడినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇకపైన కూడా ఏ మాత్రం ఉపేక్షించేది లేదని, రాష్ట్ర ప్రయోజనాలను ఫోకస్‌గా పెట్టి గవర్నర్‌ను సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసింది. అసలే ఎన్నికల సమయం కావడంతో గవర్నర్‌ వ్యవస్థను పొలిటికల్‌ అస్త్రంగా మల్చుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. రానున్న రోజుల్లో పరస్పరం విమర్శ, ప్రతివిమర్శలు జోరందుకునే అవకాశాలున్నాయి. ఆమెను బీజేపీ ప్రతినిధి అంటూ డైరెక్ట్ కామెంట్లు కూడా తెరపైకి వచ్చే అవకాశమున్నది.

Advertisement

Next Story

Most Viewed