TS: గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు..!

by GSrikanth |
TS: గవర్నర్ కోటా MLC అభ్యర్థులు ఖరారు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇద్దరి పేర్లను దాదాపుగా ఖరారు చేసింది. ప్రస్తుతానికి గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, విద్యాసంస్థల అధినేత జాఫర్ జావీద్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ కోదండరాంను తక్షణం ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆసక్తికర చర్చ మొదలైంది.

ఉద్యమంలో కీలక పాత్ర..

తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరాం పోషించిన పాత్ర, ప్రొఫెసర్‌గా సేవల ఆధారంగా ఆయన పేరును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించి గవర్నర్‌కు పంపే అవకాశముంది. రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ రాజకీయాలతో ముడిపెట్టకుండా ఉండేలా ప్రభుత్వం నుంచి వెళ్ళే ఫైల్‌లో నిర్దిష్టంగా వివరాలను పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. గత ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యానారాయణ విషయంలో గవర్నర్ భిన్నంగా స్పందించడంతో ఈసారి అలాంటి చేదు అనుభవం ఎదురుకాకుండా వ్యవహరించాలని భావిస్తుంది. మరోస్థానానికి హైదరాబాద్‌లో ముఫకంజా, సుల్తాన్ ఉల్ ఉలూమ్ లాంటి విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జావీద్ జాఫర్ పేరును కాంగ్రెస్ పరిశీలిస్తుంది. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి కావడంతో విద్యారంగం తరఫున ఆయనను ప్రతిపాదించాలనుకుంటుంది. త్వరలోనే క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని రాబోయే స్టేట్ బడ్జెట్ సమావేశాల్లోపే ఫైనల్ చేయాలని ఆలోచిస్తుంది.

మంత్రి వర్గంలోకి మైనారిటీ వ్యక్తి?

మంత్రివర్గంలో ఒక మైనారిటీ వ్యక్తిని ఉంచాలన్నది కాంగ్రెస్ విధానం. ప్రమాణ స్వీకారం చేసిన 11 మందిలో మైనారిటీలు లేరు. ఇంకా ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉన్నందున కీలకంగా మారింది. మాజీ మంత్రి షబ్బీర్అలీ, మాజీ ఎంపీ అజారుద్దీన్, ఫెరోజ్‌ఖాన్, మస్కటి అలీ తదితరులను ఎమ్మెల్సీలను చేయడంపై పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. కానీ వీరంతా ప్రత్యక్షంగా రాజకీయ పార్టీ (కాంగ్రెస్)తో సంబంధాలు ఉన్నవారు కావడంతో గవర్నర్ కోటా నుంచి ఎంపిక కావడంలో ఇబ్బందులున్నాయి. ఈ స్థానానికి నామినేటెడ్ కోటానా? ఎమ్మెల్యే కోటా నుంచా? స్థానిక సంస్థల కోటా నుంచా? అనే చర్చలు పార్టీలో ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకోవైపు అద్దంకి దయాకర్, చిన్నారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా ఇతరుల కోసం త్యాగం చేయడంతో వీరికి అవకాశాలు కల్పించాలని ఏఐసీసీ నేతలు బలంగా భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story