- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్కింగ్ జర్నలిస్టులకు గవర్నర్ దత్తాత్రేయ కీలక హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ (ఇండియన్ జర్నలిస్టు యూనియన్) డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. వర్కింగ్ జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్ కూడా న్యాయమైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. హర్యానాలోని పంచకులలో ఆగస్టు 3, 4 తేదీల్లో జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాల ముగింపు సెషన్‌కు ఆదివారం చీఫ్ గెస్టుగా హాజరైన గవర్నర్ బండారు దత్తాత్రేయ పై భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాల్లో ఒకటైన మీడియా పటిష్టంగా ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు.
ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయని, పార్టీలు కూడా వస్తూ పోతూ ఉంటాయని, కానీ దేశం శాశ్వతమన్నారు. దేశ అభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని, అందుకు బలమైన మీడియా అవసరమన్నారు. ప్రభుత్వాలు చేసే మంచిని, చెడును ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యత మీడియాదేనని, నిబద్ధతతో పనిచేసే పాత్రికేయులను చూసి ముఖ్యమంత్రులు సైతం భయపడటం తనకు తెలుసున్నారు. అలాంటి పాత్రికేయులను పిలిచి వారు లేవనెత్తిన సమస్యలపై మాట్లాడుకోవడం గతంలో జరిగేదని గుర్తుచేసుకున్నారు. పాలకులకంటే నిజం చెప్పే జర్నలిస్టే ఉన్నతుడని బండారు దత్తాత్రేయ అన్నారు. సత్యం చెప్పడానికి, వాస్తవాలను వెలుగులోనికి తేవడానికి మీడియా కృషి చేయాలన్నారు. గతంలో ఎన్నో కుంభకోణాలను, అక్రమాలను, అవినీతిని వెలుగులోకి తేవడంలో పరిశోధనాత్మక జర్నలిజం ముఖ్య భూమిక పోషించిందని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తూ ఇటీవల వాస్తవాలను వెలుగులోకి తెస్తే సహించలేని కొన్ని దుష్ట శక్తులు మీడియాపై దాడులు చేస్తున్నాయన్నారు.
సత్యాన్ని వెలుగులోకి తేవాలంటే జర్నలిస్టు నిర్భీతితో, సాహసంతో, నిబద్ధతతో విధి నిర్వహణ చేయాల్సి ఉంటుందని, అలాంటివారికి భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఉన్నదన్నారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని చేయాలని ఐజేయూ డిమాండు న్యాయబద్దమేనని పేర్కొన్నారు. ప్రత్యేక భద్రతా చట్టం డిమాండును కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. గతంలో భువనేశ్వర్‌లో జరిగిన ఐజేయూ ప్లీనరీకి కేంద్ర కార్మికశాఖ మంత్రి హోదాలో తాను హాజరయ్యానని , వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల గురించి తనకు అవగాహన కలిగిందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల వేజ్ బోర్డు నియమించే అంశాన్ని యూనియన్ నేతలు అప్పట్లోనే తన దృష్టికి తెచ్చారని, వెంటనే యూనియన్ల ప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేశానని దత్తాత్రేయ గుర్తుచేశారు. ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని రద్దు చేయడంతో జర్నలిస్టుల వేజ్ బోర్డు కూడా రద్దయ్యిందన్నారు.
ఇటీవల కాలంలో అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, కృత్రిమ మేధ ప్రవేశంతో మీడియా రంగంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. మీడియాకు విలువలు ప్రధానమని, అది లేకుంటే విశ్వసనీయత, గౌరవం ఉండదన్నారు. పాత్రికేయులు సమాచారాన్ని సమాచారంగానే ఇవ్వాలని, న్యూస్ బదులు వ్యూస్ ఇవ్వడం మంచి పద్ధతి కాదని దత్తాత్రేయ అన్నారు. ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తనకు నాలుగున్నర దశాబ్దాలుగా పరిచయమని, విలువలు కలిగిన జర్నలిస్టుగా, నిబద్ధత కలిగిన యూనియన్ నేతగా తాను గౌరవస్తానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు ఈ జాతీయ సమావేశానికి ఎక్కువగా హాజరయ్యారని గుర్తుచేసి కొద్దిసేపు తెలుగులో మాట్లాడారు. ఐజేయూ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, సామాన్య కార్యకర్తగా ప్రారంభం అయిన బండారు దత్తాత్రేయ రాజకియ ప్రస్థానంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేశారని, ఎలాంటి భేషజాలు లేకుండా సామాన్య ప్రజలతో కలిసిమెలిసి మెలిగే నేతగా ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా మన్ననలు పొందారని, అందుకే అన్ని రాజకీయ పార్టీల నేతలూ ఆయన్ని అభిమానిస్తారని వివరించారు. ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ ప్రతి ఏటా దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే ‘ఆలయ్ బలయ్’ కార్యక్రమం ప్రాచుర్యాన్ని పొందిందన్నారు.