- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైకోర్టులోనే తేల్చుకుంటాం.. గవర్నర్‌పై టీ సర్కార్ పిటిషన్ !
దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలు చివరకు రాజ్యాంగ సంక్షోభానికి దారి తీయనున్నదా? రెండు పార్టీల (బీజేపీ, బీఆర్ఎస్) మధ్య పోరు రెండు వ్యవస్థల మధ్య ఘర్షణకు కారణమైందా? అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ నుంచి ఆమోదం రాకపోవడం అనూహ్య పరిణామాలకు దారితీయనున్నదా..? ఇలా పలు ప్రశ్నలకు ప్రస్తుతం రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిస్థితి సరికొత్త అనుమానాలకు తావిచ్చినట్లయింది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణకు గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ మేరకు హైకోర్టులో సోమవారం మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేయనున్నది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 3 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. సమావేశాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి కోరుతూ పది రోజుల క్రితమే సమాచారం పంపామని, ఇప్పటికీ రాజ్‌భవన్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి తొలుత గవర్నర్ నుంచి ఆమోదం రావాల్సి ఉందని, ఆ తర్వాత బడ్జెట్‌ను తయారుచేసి మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత తుది ప్రతిని గవర్నర్‌కు పంపాల్సి ఉంటుందని, అక్కడ అప్రూవల్ అయిన తర్వాత శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెడుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఫైనాన్స్ బిల్లు, వార్షిక ద్రవ్య వినియోగ స్టేట్‌మెంట్ లాంటివి సభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ నుంచి విధిగా ఆమోదం రావడం అవసరమని ఆ వర్గాలు నొక్కిచెప్పాయి. ఆ ప్రకారమే ప్రభుత్వం పది రోజుల క్రితమే గవర్నర్‌కు సమాచారం ఇచ్చిందని, కానీ ఇంకా ఆమోదం రాకపోవడంతో బడ్జెట్‌ను అసెంబ్లీ, కౌన్సిల్‌లో ప్రవేశపెట్టడానికి చిక్కులు ఎదురవుతున్నాయని పేర్కొన్నాయి. గవర్నర్ ఆమోదం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు ఒప్పుకోనందున ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగక తప్పడంలేదు. గతంలో రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి రాజ్యాంగపరమైన చిక్కులు ఎదురుకాలేదు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉప్పు-నిప్పు లాంటి పరిస్థితులు ఉన్నా ఇలాంటి సంక్షోభం తలెత్తలేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 207 ప్రకారం... ఏదైనా బిల్లును రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి ఆపరేషన్‌లోకి తెచ్చినా, అది రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ వ్యవహారంతో ముడిపడి ఉన్నట్లయితే గవర్నర్ ఆమోదం లేకుండా అసెంబ్లీ లేదా శాసనమండలిలో ఆమోదం పొందరాదు. అలాంటి బిల్లును పరిగణనలోకి తీసుకోవాలంటూ గవర్నర్ సిఫారసు చేస్తే మాత్రమే రాష్ట్ర చట్టసభల్లో పాస్ కావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు గవర్నర్ నుంచి పది రోజులైనా ఆమోదం రాకపోవడంతో ప్రభుత్వం ఆందోళనలో పడింది. బడ్జెట్ సమావేశాలు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ తుది మెరుగులు దిద్ది.. మంత్రివర్గం ఆమోదం తెలిపి ఆ తర్వాత గవర్నర్ అప్రూవల్ కోసం పంపడం ఆనవాయితీ.
కానీ తొలి దశలోనే గవర్నర్ నుంచి సమ్మతి రాకపోవడంతో సర్కారులో పరేషన్ మొదలైంది. గవర్నర్‌తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుందనే వార్తలు వెలువడినా చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి మొగ్గు చూపినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. హైకోర్టులో సోమవారం దాఖలయ్యే లంచ్ మోషన్ పిటిషన్ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ప్రకటించినట్లుగా ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుందా..? ఒకవేళ అసెంబ్లీ సమావేశాలను యథావిధిగా మొదలుపెట్టినా బడ్జెట్‌ను ప్రవేశపెట్టకపోవచ్చా.. ఇలాంటి సందేహాలు వెంటాడుతున్నాయి.