పన్నుల ఎగవేతపై సర్కారు సీరియస్.. CM రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Rajesh |
పన్నుల ఎగవేతపై సర్కారు సీరియస్.. CM రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పూర్తి స్థాయి బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్న సమయంలో ఆదాయాన్ని ఆర్జించే డిపార్టుమెంట్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా సాధించిన ప్రగతిపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ఇకపైన అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పన్నుల ఎగవేతకు ఆస్కారం లేకుండా అన్ని విభాగాలూ కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రతీ విభాగం నెలవారీ లక్ష్యాన్ని తయారుచేసుకుని దానికి తగినట్లుగా ఫలితాలను విశ్లేషించుకోవాలన్నారు. పన్నుల వసూళ్ళపై అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించాలని నొక్కిచెప్పారు. అవసరమైతే సంస్కరణలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు.

ఇకపైన ప్రతీ నెలా మొదటి వారంలో స్వయంగా తానే రివ్యూ చేస్తానని, ఆయా శాఖలు ఆర్జించిన ఆదాయం, లక్ష్యంలో సాధించిన ప్రగతి తదితరాలపై సమీక్షిస్తానని స్పష్టం చేశారు. నెలవారీ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతీ శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రివ్యూ చేస్తారని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆదాయం పెరిగేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఎక్సయిజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా తదితర పలు శాఖల అధికారులతో సమీక్ష సందర్భంగా పలు సూచనలు చేశారు. రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. ఆదాయం తెచ్చి పెట్టే విభాగాలను అవసరానికి అనగుణంగా పునర్ వ్యవస్థీకరించుకోవాలన్నారు.

రెవెన్యూ వసూళ్ళు ఆశాజనకంగా లేవు

ఎంచుకున్న వార్షిక లక్ష్యంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ చివరి వరకు వచ్చిన ఆదాయం ఆశించినంతటి స్థాయిలో ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రతి నెలా మంత్లీ టార్గెట్‌ను నిర్దేశించుకోవాలని, రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై స్వయంగా తానే సమీక్ష నిర్వహిస్తానని అధికారులను అప్రమత్తం చేశారు. నెలవారీ సమీక్షతో పాటు ప్రతీ శుక్రవారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని తెలిపారు. బడ్జెట్‌లో స్పష్టంగా అంచనా వేసుకున్నా ఆ స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోవడానికి దారితీసిన పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

జీఎస్టీ వసూళ్ళపై నిక్కచ్చిగా ఉండాలి

రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీ ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. జీఎస్టీ రాబడిని పెంచుకునేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలన్నారు. జీఎస్టీ చెల్లింపుల ఎగవేత విషయంలో ఎవరినీ ఉపేక్షించాల్సిన అవసరం లేదని, నిక్కచ్చిగా పన్నులను వసూలు చేయాల్సిందేనని ఆదేశించారు. పెట్రోలు, డీజిల్‌పై ‘వాట్’ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు పరిమిత కాలం పన్ను సబ్సిడీ విధానం అమలైందని, తిరిగి పన్నును వసూలు చేయటం ద్వారా వాహనాల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం పడిందో అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

మద్యం రవాణాపై టెక్నాలజీతో నిఘా

ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినప్పటికీ ఆ మేరకు ఆదాయం పెరగకపోవటానికి కారణాలపై ఆ శాఖ అధికారుల నుంచి సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని ఈ సమావేశంలో చర్చ జరిగింది. డిస్టిలరీల నుంచి మద్యం పక్కదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి గణనీయమైన స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న ఎక్సయిజ్ శాఖపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో లోతుగా రివ్యూ చేశారు. అంచనాలకు మించి మద్యం రెవెన్యూ వసూలు కావాల్సి ఉన్నప్పటికీ దానికి భిన్నంగా తగ్గడంపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలపై కసరత్తు జరుగుతున్న సమయంలో సీఎ, ఈ రివ్యూ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.

రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా పెరుగుతుంది

రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్ విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ తదితర ప్రాజెక్టులతో జరిగే ప్రయోజనాలు, పెరిగే ఆర్థిక వనరులు తదితరాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ది కార్యక్రమాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆరు నెలల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో అటు కమర్షియల్ నిర్మాణాలు పెరిగాయని ముఖ్యమంత్రి భావించారు. రానున్న రోజుల్లో గృహ నిర్మాణాలు కూడా అదే వరుసలో పుంజుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇసుక రవాణాపై స్పెషల్ ఫోకస్

ఇసుక, ఇతర ఖనిజ వనరుల (మైనింగ్) ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఎక్సయిజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా హాజరై వివరాలు అందించారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ఆదాయాన్ని ఆర్జించే శాఖలకు సంబంధించిన అనేక అంశాలపై లోతుగా చర్చ జరిగింది.

Advertisement

Next Story

Most Viewed