నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్

by Geesa Chandu |   ( Updated:2024-08-25 04:44:53.0  )
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న అంగన్‌వాడీ పోస్టులకు.. అతి త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపుగా 11 వేల పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేస్తామని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో 15 వేల ప్లే నర్సరీ పాఠశాలలు ప్రారంభించనున్నట్లు సీతక్క అన్నారు. అయితే రాష్ట్రం మొత్తం 35,700 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో ఇప్పుడు కొత్తగా 15 వేల వరకూ నర్సరీ పాఠశాలలను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంగ్ల బోధన, ఇతర అంశాలపై కూడా ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. అయితే ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలోనే నిర్వహిస్తామని.. గతంలో సీతక్క అన్నారు. ఈ మేరకు అతి త్వరలోనే అంగన్‌వాడీ నియామకాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అంగన్‌వాడీ పోస్టులు, తదితర ప్రాథమిక వివరాలు..

ఈ నియామకాల్లో... మెయిన్‌(ప్రధాన) అంగన్‌వాడీ టీచర్‌, మినీ అంగన్‌వాడీ టీచర్‌, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను ఆయా జిల్లాల్లో ఖాళీల ఆధారంగా భర్తీ చేస్తారు. అంగన్‌వాడీ టీచర్‌తో పాటు హెల్పర్లుగా ఎంపికయ్యేవారు కనీసం పదోతరగతి/ ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే జనరల్‌, బీసీ అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే స్థానికంగా స్థిర నివాసం కలిగివున్న వివాహిత మహిళలు మత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలనల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. ఇందులో ఎంపికైన అంగన్‌వాడీ టీచర్‌లకు నెలకు రూ.12,500 నుంచి రూ.13,500 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇంకా హెల్పర్‌ కు రూ.8,000 జీతంగా చెల్లిస్తారు.

కాగా అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన విధి విధానాలు, ఖాళీల భర్తీ, పోస్టుల సంఖ్య వంటి అంశాల సమాచారం మాత్రం అధికారిక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత వివరంగా తెలుసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం మేరకే తుది నిర్ణయం ఉండనుంది.

Advertisement

Next Story