స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త

by GSrikanth |   ( Updated:2023-08-13 15:04:11.0  )
స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ సిటీలోని సాధారణ ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీలను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే, హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టీ-24 టికెట్‌ను కేవలం రూ.75కే ఇవ్వాలని నిర్ణయించింది. పిల్లలకు టీ-24 టికెట్‌ను రూ.50కే అందజేయనుంది. ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవం ఒక్కరోజు మాత్రమే ఈ రాయితీలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80 గా ఉంది. స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో టి-24 టికెట్‌ను ప్రయాణికులందరికీ రూ.75కే సంస్థ ఇవ్వనుండగా.. పిల్లలకు రూ.50కి ఇస్తోంది. రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్ళు పైబడిన స్త్రీ, పురుష సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ ఒక్కరోజు టికెట్‌లో 50 శాతం రాయితీని కల్పిస్తోంది. ప్రయాణ సమయంలో వయసు ధ్రువీకరణ కోసం బస్ కండక్టర్‌కి తమ ఆధార్ కార్డును చూపించాలి. 60 ఏళ్లు దాటినా వర్తిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవ రాయితీలకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040- 69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు. ఈ రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనారు.

Advertisement

Next Story