Ponnam prabhakar: విగ్రహాలు క్యూ కట్టాయి త్వరగా నిమజ్జనాలు చేయాలి: మంత్రి పొన్నం

by Prasad Jukanti |   ( Updated:2024-09-17 13:39:24.0  )
Ponnam prabhakar: విగ్రహాలు క్యూ కట్టాయి త్వరగా నిమజ్జనాలు చేయాలి: మంత్రి పొన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా సాగుతున్నదన్నారు. ఇవాళ సాయంత్రం డీజీపీ జితేందర్ తో కలిసి ఏరియల్ సర్వే ద్వారా నిమజ్జనం పరిస్థితిని మంత్రి వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన రేపు ఉదయం లోపు నిమజ్జనాలు పూర్తవుతాయని ఆశిస్తున్నామన్నారు. నిమజ్జనోత్సవాన్ని పండగ వాతావరణంలో నిర్వహించుకునేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని అయితే రేపు వర్కింగ్ డే కావడం వల్ల విగ్రహాలు త్వరగా నిమజ్జనం చేయాలని మండప నిర్వాహకులకు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేశారు. ఉస్మానియా, పురానపుల్, అఫ్జల్ గంజ్ ఏరియాలో కొంత నిమజ్జన విగ్రహాలు క్యూ కట్టాయన్నారు.

కాగా నిమజ్జనాల కోసం చార్మినార్, నాంపల్లి, అఫ్జల్ గంజ్, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం రూట్లలో గణనాథులు భారీగా ట్యాంక్ బండ్ వైపు తరలి వస్తున్నారు. మొజాంజాహి మార్కెట్ వద్గ గణేశ్ శోభాయాత్ర జోరుగా సాగుతోంది. ట్యాంక్ బండ్ వద్ద శోభాయాత్రలను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. బ్యాండ్ మేళాలు, డీజే సౌండ్ ల మధ్య గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరుతుంటే భక్తులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు.

Advertisement

Next Story