గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడుట లేడు.. ఆచూకీ తెలిపితే బహుమానం.. వెలసిన పోస్టర్లు

by Ramesh N |   ( Updated:2024-06-15 09:12:53.0  )
గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనబడుట లేడు.. ఆచూకీ తెలిపితే బహుమానం.. వెలసిన పోస్టర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమ ఎమ్మెల్యే కనడుట లేదని సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో పోస్టర్లు వెలిశాయి. గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం కేసీఆర్ కనబడటం లేదని స్థానిక బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ ప్రజలు ఇక్కడ.. కేసీఆర్ ఎక్కడ అంటూ నినాదాలు చేస్తూ.. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్,ఇంద్ర పార్క్ చౌరస్తా, బస్టాప్ వద్ద, అంబేద్కర్ చౌరస్తా వద్ద, మున్సిపల్ ఆఫీస్ వద్ద కేసీఆర్ కనబడడం లేదు అని పోస్టర్స్ అంటించారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగాలని, కాబట్టి గజ్వేల్ ఎమ్మెల్సేగా ఉన్న కేసీఆర్ ఎక్కడ ఉన్నాగానీ ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. గతంలో సీఎం ఉంటే కాబట్టి తెలంగాణ కోసం పని చేశారు.. ఇప్పుడు సీఎం పదవి, అధికారం లేదు.. అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక సామాన్య ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్న క్రమంలో ఇప్పుడు గజ్వేల్‌కు రావడానికి ఏమైంది? అని ప్రశ్నించారు.

గజ్వేల్ ప్రజలపైన ప్రేమ లేదన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు గెలిపించిన కూడా ప్రజలపై కనీస కనికరం లేదా? అని ప్రశ్నించారు. గజ్వేల్ లో అనేక సమస్యలు ఉన్నాయని, గజ్వేల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైన కేసీఆర్ ఎక్కడ ఉన్న గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం సైతం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే గజ్వేల్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు వెల్లడించారు. మరోవైపు పోస్టర్లలో గజ్వేల్ నియోజక వర్గానికి మూడవ సారి శాసనసభ్యులుగా గెలిచిన క్షణం నుంచి నేటి వరకు గజ్వేల్‌కు రాలేదు. ఎక్కడ కనిపించలేదు. సీఎం పదవి పోగానే బాధలో బాత్రూంలో జారి పడి కాలు విరిగిపోయిందని తెలిసింది. సారు కారు పదహారు అని ఎక్కడ పరారు అయ్యాడో ఎలా ఉన్నాడో తెలియడం లేదు.

భయంకరమైన హిందువు

పూర్తి పేరు.. కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వయస్సు 70 ఏళ్లు, వృత్తి.. అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేయడం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం, భాద్యత.. గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం, గుర్తులు.. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ లేదా తెల్ల లుంగి, నెత్తిమీద టోపీ, అర్హతలు.. భయంకరమైన హిందువు, 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి, ఎకరాకు కోటి రూపాయలు సంపాదించే వ్యక్తి.. కేసీఆర్ ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమానం ఇవ్వబడును అని పోస్టర్లలో పేర్కొన్నారు. కేసీఆర్ ఆచూకీ తెలిస్తే గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంప్రదించగలరని పోస్టర్లలో ఉంది.

Advertisement

Next Story