- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట
దిశ, తెలంగాణ బ్యూరో: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు గత నెల 24న వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ రూపంలో అభ్యంతరాలను సుప్రీంకోర్టుకు సమర్పించాలని, నాలుగు వారాల తర్వాత విచారణ జరగనున్నట్లు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది.
కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, దానికి కొనసాగింపుగా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించడం, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి లేఖ రాసి వీలైనంత తొందరగా గెజిట్ జారీ చేయాలని ఆదేశించడం.. వీటన్నింటి నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నాలుగు వారాల వరకు ఆయనకు రిలీఫ్ లభించినట్లయింది.
సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణ సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి తరఫు న్యాయవాది సుందరం వాదిస్తూ.. మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ గతంలో కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ కొన్ని అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళారని గుర్తు చేసి తగిన ఆధారాలను ధర్మాసనం ముందు ఉంచారు. బ్యాంకు అకౌంట్ల వివరాలను కృష్ణమోహన్ రెడ్డి తన అఫిడవిట్ (2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా) వెల్లడించకపోవడం తప్పేనని అంగీకరించారు. కానీ అవి డిపాజిట్లు కావని, సేవింగ్స్ అకౌంట్స్ మాత్రమేనని, అందువల్లనే ఆ వివరాలను వెల్లడించలేదని కోర్టుకు వివరించారు.
ఇవన్నీ కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద లేవని, ఆయన భార్య పేరు మీద ఉన్నాయన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చెందిన భూముల క్రయ విక్రయాలపైనా కోర్టులో కంప్లైంట్‌ను డీకే అరుణ పేర్కొన్నారని, కానీ వాటిని గతంలోనే విక్రయించినట్లు సంబంధింత సేల్ డీడ్, పత్రాలను ధర్మాసనానికి అందజేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కృష్ణమోహన్ రెడ్డి తన అఫిడవిట్‌లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారంటూ హైకోర్టును డీకే అరుణ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి తోడు డీకే అరుణ కూడా కెవియట్ పిటిషన్ వేయడంతో ఆయన పిటిషన్‌పై విచారణ జరిపే సందర్భంగా తన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో నాలుగు వారాల వరకు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి ఊరట లభించింది.