వ్యూహాత్మకంగా తెలంగాణ సర్కార్.. ఆఖర్లో నిధులు

by Sathputhe Rajesh |
వ్యూహాత్మకంగా తెలంగాణ సర్కార్.. ఆఖర్లో నిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నిధుల విడుదలలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఏండ్ల నుంచి పెండింగ్​ పెట్టిన నిధులను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖర్లో విడుదల చేసింది. అంతేకాకుండా వాటిని ఏ పద్దు కింద ఖర్చు చేయాలనే అంశాన్ని కూడా తేల్చలేదు. ఫైనాన్సియల్​ ఇయర్​ ఇంకో మూడు వారాల్లో ముగుస్తుందనగా.. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు నిధులు ఇస్తున్నట్లు బీఆర్వో జారీ చేసింది. ఏకంగా రూ. 500 కోట్లకు బీఆర్వో ఇచ్చింది. ఈ మూడు వారాల్లో వీటిని ఎలా ఖర్చు చేయాలో అధికారులకు తెలియడం లేదు. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు ఖర్చు చేయకుంటే తిరిగి అవి ప్రభుత్వ ఖాతాకే జమ అవుతాయి. గతంలో అర్హత సాధించిన లబ్ధిదారులకు రుణంగా మంజూరి చేయాలా లేనిపక్షంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలా అనేదాపై స్పష్టత లేకపోవడంతో సీఎం ఆమోదం కోసం ఫైల్​ను పంపించారు. కానీ, ప్రగతిభవన్​ నుంచి ఈ ఫైల్​ ఇంకా తిరిగి రావడం లేదు. దీంతో ఇచ్చిన రూ. 500 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖాతాలోకే చేరే అవకాశాలున్నాయి.

ప్రణాళిక కూడా పెండింగ్​

ఈ ఆర్థిక సంవత్సరంలో టీబీసీసీఎఫ్​సీ, ఎంబీసీడీసీలు వార్షిక ప్రణాళికలను తయారు చేసి గతంలోనే ప్రభుత్వానికి పంపించాయి. స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు, వ్యక్తిగత రుణాలు, వృత్తి నైపుణ్య శిక్షణ, చిన్న పరిశ్రమలకు తోడ్పాటు వంటి అంశాలకు ప్రయార్టీ ఇస్తూ కొద్ది నెలల కిందటే ప్రభుత్వానికి పంపాయి. కానీ ఈ ప్రతిపాదనలకు ఎలాంటి ఆమోదం రాలేదు. కనీసం ఏమైనా మార్పులు, ప్రధానంగా తీసుకోవాల్సిన అంశాలను కూడా సూచించలేదు. దీంతో ఆ ఫైల్​ మూలకు పడింది.

పాత చెక్కులు పక్కకే

ఇక 2018–19లో బీసీ కార్పొరేషన్​ రుణాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. రూ. 50 వేలలోపు రుణాలు ఇచ్చేందుకు అప్లికేషన్లు ఇచ్చిన వారికి మంజూరు చేస్తున్నట్లు సమాచారమిచ్చారు. కానీ, 2018లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాటికి బ్రేక్​ వేశారు. వాస్తవంగా రూ. 50వేలలోపు రాయితీ రుణాలకు దరఖాస్తు చేసిన వారిని ఎంపిక చేసి, దాదాపు 30 వేల మందికి చెక్కులు కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్​ ఎన్నికలు అంటూ సాగదీసి, దానికి నిధులు ఇవ్వలేదు. దాదాపు రూ. 160 కోట్లను ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో పెండింగ్​ పెట్టారు. దీనిపై పలుమార్లు ప్రభుత్వానికి ఫైల్​ పంపించినా రిప్లై రాలేదు. దీంతో ఆ చెక్కులు కూడా ఆగిపోయాయి.

ఇప్పుడేం చేయాలి

తాజాగా బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు రూ. 500 కోట్లు ఇస్తూ ప్రభుత్వం బీఆర్వో ఇచ్చింది. అయితే, వీటిని ఎందుకు వినియోగించాలో స్పష్టం చేయలేదు. కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వాలంటే ఈ మూడు వారాల్లో ప్రాసెస్​ చేయడం కష్టమే. దరఖాస్తులను స్వీకరించి, వాటిలో అర్హులను ఎంపిక చేయడం అధికారులకు కత్తిమీద సామే. దీంతో కొత్త రుణాలు ఇవ్వడంపై అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇక పాత రుణాలను గ్రౌండింగ్​ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 2018లో ఎంపిక చేసిన అర్హులకు రూ. 50వేల వరకు రాయితీ రుణాలకు సంబంధించిన జాబితా తయారుగా ఉంది. కానీ, దీనికి సీఎం ఆమోదం అనివార్యంగా మారింది. ఇప్పుడు నిధులు రావడంతో రూ. 160 కోట్లను పాత రుణాలకు విడుదల చేసేందుకు అనుమతివ్వాలంటూ నివేదిక పంపిస్తే ఇంకా సమాధానం రావడం లేదు. దీంతో పాత వాటికి వినియోగించుకోలేక, కొత్తగా రాయితీ రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించి, లబ్ధిదారులను ఎంపిక చేసే సమయం లేక అధికారులు ఏం చేయలేక ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఇచ్చినట్టే ఇచ్చిన కార్పొరేషన్​ నిధులు తిరిగి ప్రభుత్వ ఖాతాకే మళ్లే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story