బీజేపీలోకి నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు.. బీఆర్ఎస్ విలీనంపై టీ కాంగ్రెస్ నేత సంచలన ట్వీట్

by Prasad Jukanti |
బీజేపీలోకి నలుగురు  బీఆర్ఎస్ ఎంపీలు.. బీఆర్ఎస్ విలీనంపై టీ కాంగ్రెస్ నేత సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు ముగిసినా తెలంగాణ రాజకీయాలు మాత్రం హాట్ హాట్ గా సాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కారు దిగుతుండటంతో గులాబీ పార్టీ ఫ్యూచర్ ఏంటి అనే చర్చ అందరి మెదళ్లలో మెదులుతున్నది. ఈ క్రమంలో వలసలను నిలువరించడంతో పాటు కవితకు బెయిల్ దక్కేలా అధినేత కేసీఆర్ బీజేపీతో సీక్రెట్ గా ఒప్పందం చేసుకునే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తున్నది. ఇటువంటి తరుణంలో టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్, కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ సామ రామ్మోహన్ బీజేపీ, బీఆర్ఎస్ విలీనంపై శుక్రవారం ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి:

బీఆర్ఎస్, బీజేపీ ఫిక్సింగ్ చేసుకున్నాయని సామ రామ్మోహన్ ఆరోపించారు. దశల వారీగా బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందని పేర్కొన్నారు. మొదటి దశ విలీనం ప్రక్రియకు భాగంగా బీఆర్ఎస్ కు చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ఆరోపించారు. ఇందుకు ఇరు పార్టీలు గ్రీన్ సిగ్నల్ తెలిపాయని పేర్కొన్నారు. కేటీఆర్, హరీశ్ రావు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఉండి రాయబారం నడిపించారని.. 'ఢిల్లీ రాయబారంలో కీలక ఒప్పందం!' అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

కేసీఆర్ డీల్!:

ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర, కే.ఆర్.సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, పార్థసారధి రెడ్డి రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కవిత బెయిల్ తో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు చెక్ పెట్టాలంటే ఇదే సరైన మార్గం అని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఎంత ప్రయత్నించినా పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల వలసలను ఆపడం సాధ్యం కావడంలేదని దీంతో బీజేపీతో డీల్ కుదుర్చుకోవడమే తక్షణ కర్తవ్యంగా భావిస్తున్నట్లు ప్రచారం గుప్పుమంటోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్, హరీశ్ రావు అక్కడ బీజేపీ పెద్దలతో రాజీ కుదుర్చుకున్నారని ఇక ముందస్తు ఒప్పందంలో భాగంగా త్వరలోనే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కాషాయ కండువా కప్పుకోబోతున్నారనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో, సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. మొత్తంగా బీఆర్ఎస్, బీజేపీ డీల్ ప్రచారం సెగలు కక్కుతుంటే అంతిమంగా ఏం జరగనున్నదో కాలమే నిర్ణయించనున్నది.

Advertisement

Next Story