ట్రిబ్యునల్ నడిచే విధంగా చర్యలు చేపట్టాలి.. సీఎస్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

by GSrikanth |
ట్రిబ్యునల్ నడిచే విధంగా చర్యలు చేపట్టాలి.. సీఎస్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: బిల్డింగ్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్, సాంకేతిక సభ్యులు మరియు ఇతర సిబ్బందిని తక్షణమే నియమించి ట్రిబ్యునల్ నడిచే విధంగా చర్యలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం. పద్మనాభరెడ్డి కోరారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు సోమవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. అక్రమ కట్టడాలతో ప్రణాళికా బద్ధంగా పట్టణాలు అభివృద్ధి చెందడం లేదని, అక్రమ కట్టడాలతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకునే సందర్భంలో బిల్డర్లు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకొని అక్రమ కట్టడాలు పూర్తి చేయడమే కాకుండా అమ్ముతున్నారన్నారు. ఈ విషయం తెలియని అమాయకులు కొనుగోలు చేసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నివసించే వారికి ప్రాణపాయ స్థితులు కల్పిస్తున్నారని.. ఈ మధ్య సికింద్రాబాద్ రూబిహోటల్ ఘటనే ఇందుకు ఉదాహారణ అన్నారు.

అక్రమ కట్టడాల నిర్మాణం ఆదిలోనే నిలిపేయడానికి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ, చైర్ పర్సన్, సాంకేతిక సభ్యుల నియామకం చేయకపోవడంతో గత 6 ఏళ్లుగా ట్రిబ్యునల్ కాగితాలకే పరిమితం అయిందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హైకోర్టుకు నాలుగు వారాల్లో ట్రిబ్యునల్ చైర్ పర్సన్, సాంకేతిక సభ్యుల నియామకం చేస్తామని ప్రభుత్వ న్యాయవాది స్పష్టం చేశారని, ఐదు నెలలుగా ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఇది కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందన్నారు. బిల్డింగ్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్, సాంకేతిక సభ్యులు మరియు ఇతర సిబ్బందిని తక్షణమే నియమించి ట్రిబ్యునల్ నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను కోరారు.

Advertisement

Next Story

Most Viewed