భద్రతా కమిషన్ కాగితాలకే పరిమితమా?.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

by GSrikanth |
భద్రతా కమిషన్ కాగితాలకే పరిమితమా?.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీసులపై వచ్చే ఫిర్యాదులను సత్వర విచారణకు పోలీస్ కంప్లయింట్ అధారిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం లేఖ రాశారు. పోలీసు వ్యవస్థపై రాజకీయ ఒత్తిడి, ఆధిపత్యం లేకుండా చేయడానికి అలాగే పోలీసు వ్యవస్థ అన్ని వేళలా రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేసేందుకు రాష్ట్ర భద్రతా కమిషన్ మార్గదర్శకం చేస్తుందన్నారు. సీఎం లేదా హోంశాఖ మంత్రి అధ్యక్షుడిగా, డీజీపీ కార్యదర్శిగా, శాసనసభలో విపక్షనేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన రిటైర్డ్ లేదా పనిచేస్తున్న న్యాయమూర్తి ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేని సమాజంలో పేరున్న ముగ్గురితో పోలీసు భద్రతా కమిషన్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. రాష్ట్రంలో భద్రతా కమిషన్ ఏర్పాటు చేయకపోవడంతో రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసిందన్నారు. 2021 జూలై 9న విచారణ జరగాల్సి ఉండగా రెండ్రోజుల ముందే హైకోర్టును సంతృప్తిని పరిచేందుకు భద్రతా కమిషన్‌ను ఏర్పాటు చేశారని, కానీ నేటివరకు ఈ కమిషన్ కాగితాలకే పరిమితమైందని ఆరోపించారు. కేసు హైకోర్టులో మాత్రమే క్లోజ్ అయిందన్నారు.

సుప్రీంకోర్టు పోలీసు కంప్లయింట్ అధారిటీని నియమించాలని మరో సూచన చేసిందని, జిల్లా స్థాయిలో ఈ అధారిటీ కానిస్టేబుల్ నుంచి డీఎస్పీలపై వచ్చే ఫిర్యాదులను విచారణ చేస్తుందని, రాష్ట్రస్థాయి అథారిటీ ఎస్పీ నుంచి పై అధికారులపై వచ్చే వాటిని విచారిస్తుందన్నారు. రాష్ట్రస్థాయి అధారిటీ కేవలం తీవ్రమైన నేరారోపణలు మాత్రమే విచారిస్తుందని, అయితే జిల్లా స్థాయి అధారిటీ పోలీసు అధికారుల బలవంతపు వసూళ్లు, అవినీతి, అధికార దుర్వినియోగం వాటిపై విచారణ జరిపి ప్రభుత్వానికి తమ నివేదికను పంపడం జరుగుతుందన్నారు. ఈ నివేదికను ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని కోర్టు ఆదేశించిందన్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పెద్దలు పోలీసుశాఖ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని, కిందస్థాయి పోలీసుల బదిలీలు స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగాయన్నారు. పదవీ విరమణ తర్వాత తిరిగి సలహాదారులు వంటి తాయిలాలతో పోలీసు ఉన్నతాధికారులలో చాలా మంది రాజ్యాంగాన్ని, చట్టాన్ని పక్కనపెట్టి రాజకీయ నాయకులకు నమ్మినబంట్లుగా పనిచేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ భద్రతా కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా పోలీసుశాఖ పనిలో రాజకీయ నాయకుల ఒత్తిల్లు, చట్టానికి విరుద్ధంగా పనిచేసేందుకు ఆపడానికి పోలీసు వ్యవస్థ రాజ్యాంగ భద్దంగా పనిచేయడానికి వీలుగా భద్రతా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను సత్వర విచారణ కోసం పోలీసు కంప్లాయింట్ అధారిటీని నియమించాలని సీఎంను కోరారు.

Advertisement

Next Story

Most Viewed