కేసీఆర్‌కు బిగ్ షాక్.. ప్రభుత్వ లెక్కలను బయటపెట్టిన మాజీ ఎంపీ!

by GSrikanth |   ( Updated:2022-10-17 07:33:09.0  )
కేసీఆర్‌కు బిగ్ షాక్.. ప్రభుత్వ లెక్కలను బయటపెట్టిన మాజీ ఎంపీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ రణరంగాన్ని తలపిస్తోంది. ప్రధాన పార్టీలు ఈ బై ఎలక్షన్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇక్కడ గెలిచేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. అధికార టీఆర్ఎస్ పార్టీని అన్ని కోణాల్లో నిలువరించే ప్రయత్నాలను బీజేపీ ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన నేతలంతా అధికారపార్టీ నేతలను కమలం గూటికి చేర్చే బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో ఎలాగైనా గెలవాలని భావిస్తున్న సీఎం కేసీఆర్‌కు గట్టి షాక్ ఇచ్చేలా బీజేపీ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. తాజాగా సీఎం కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టేలా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఇవిగో ఆధారాలు:

ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తోంటే అలాంటిదేమి లేదని రాజగోపాల్ రెడ్డిని ఇన్నాళ్లు మునుగోడును పట్టించుకోలేదని టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. అయితే నిధులన్నీ మూడు నియోజక వర్గాలకే చేరుతున్నాయని రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు మొండిచేయి చూపిస్తున్నారని బీజేపీ ఘాటు విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ట్విట్టర్‌లో కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లలో ఇచ్చిన ప్రత్యేక అభివృద్ధి నిధుల వివరాలు ఇవిగో అంటూ కీలక సమాచారాన్ని వెల్లడించారు. మునుగోడుకు రూ.2.5 కోట్లు కేటాయిస్తే సిద్దిపేట నియోజకవర్గానికి రూ.718 కోట్లు, గజ్వేల్ నియోజక వర్గానికి రూ.650 కోట్లు సిరిసిల్ల నియోజకవర్గానికి రూ.65 కోట్లు కేటాయించారంటూ ప్రభుత్వ లెక్కలకు సంబంధించిన వివరాలను ఆయన షేర్ చేశారు. ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి వాగ్దానాలు, నియోజకవర్గానికి నిధులు కేటాయించకున్నా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు మునుగోడులో ప్రచారం చేస్తున్న వారి ధైర్యానికి అభినందించాలా లేక ఇది వారి అజ్ఞాన ఆనందమా అని ప్రశ్నించారు.

పక్కా వ్యూహం:

మునుగోడు విషయంలో బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోందనే చర్చ జరుగుతోంది. ఓ వైపు టీఆర్ఎస్‌ను మాటలతో విమర్శలు గుప్పిస్తూనే మరో వైపు ఆర్టీఐ ద్వారా ప్రభుత్వం కేటాయించిన నిధులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బూర నర్సయ్య లాంటి కీలక నేతలు పార్టీ వీడుతుంటే మరో వైపు బీజేపీ నేతల వివరిస్తున్న లెక్కలు మునుగోడులో ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయనే టెన్షన్ అధికార పార్టీలో కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ద్వారా సీఎం కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేలా బీజేపీ స్కెచ్ వేస్తోందని తెలుస్తోంది. తాము చేసేవి ఆరోపణలే కాదని వాటికి పక్కా ఆధారాలు ఉన్నాయనేలా తాజాగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి షేర్ చేసిన వివరాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Next Story

Most Viewed