బూడిద భిక్షమయ్య గౌడ్ రాజీనామా.. మాజీ మంత్రికి షాక్ తప్పదా?

by GSrikanth |
బూడిద భిక్షమయ్య గౌడ్ రాజీనామా.. మాజీ మంత్రికి షాక్ తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తోంది. ఇక్కడ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న పార్టీలు.. నేతలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. మునుగోడు ముంగిట్లో పార్టీలు మారే నేతలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చేరికల పర్వానికి మరోసారి తెర లేచింది. ఇరు పార్టీల్లోకి రాకపోకలు జోరుగా సాగుతుండటం మునుగోడు గెలుపుపై అంచనాలను తారుమారు చేసేలా కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో బీసీల పట్ల చిన్నచూపు ఉందని ఆరోపిస్తూ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిపోయారు. ఇక బూర నర్సయ్య గౌడ్‌తో జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేసేందుకు టీఆర్ఎస్ సైతం చేరికల పర్వాన్నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. నర్సయ్య రాజీనామా తర్వాత మునుగోడు నియోజకవర్గం గౌడ సామాజిక వర్గానికి చెందిన పల్లె రవి కూమార్ గౌడ్, కళ్యాణి దంపతులకు గులాబీ గూటికి చేర్చుకున్నారు. ఇంతటితో ఆగుతుందనుకున్న ఈ చేరికల వ్యవహారం గురువారం అనూహ్య మలుపు తీసుకుంది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఇవాళ బీజేపీకి రాజీనామా చేశారు. భారతీయ జనతా పార్టీలో బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ రెండు పేజీలతో కూడిన రాజీనామా లేఖను రాశారు. బీజేపీకి గుడ్ బై చెప్పిన భిక్షమయ్య ఏ పార్టీలో చేరబోతున్నారనేది ఆసక్తిగా మారింది. జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆయన టీఆర్ఎస్ తో టచ్‌లో ఉన్నారని, కారు గుర్తు పార్టీతో సంప్రదింపులు జరిగాకే బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు రాజీనామా చేశారనే టాక్ వినిపిస్తోంది. అందువల్ల ఆయన త్వరలో గులాబీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇదే జరిగితే అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తప్పవా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ప్రత్యర్థులంతా ఒకే గూటికి?

యాదాద్రి భువనగిరి జిల్లా గుంటాల మండలానికి చెందిన భిక్షమయ్య 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వతా 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో టీఆర్ఎస్‌లో చేరిన ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 5న బీజేపీలో చేరారు. చేరిన ఆరు నెలల్లోనే అసంతృప్తి పేరుతో కమలం పార్టీకి రిజైన్ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఆలేరు టీఆర్ఎస్‌లో కలహాలు తప్పవా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆలేరులో గొంగిడి సునీత (టీఆర్ఎస్) ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన మోత్కుపల్లి నర్సింహులు టీడీపీ నుండి బహిష్కరణ వేటుకు గురై అనంతరం బీజేపీలో చేరారు. ఆయన కూడా బీజేపీకి గుడ్ బై చెప్పి గతేడాది టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఇన్నాళ్లు ప్రత్యర్థులుగా ఉన్న గొంగిడి సునీత, భిక్షమయ్య గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు కారు పార్టీలో చేరితే వర్గపోరు తప్పదనే టాక్ వినిపిస్తోంది. 2018 అసెంబ్లీ ఫలితాలు చూస్తే 49 శాతం ఓట్లతో గొంగిడి సునీత ప్రథమ స్థానంలో ఉండగా 32 శాతం ఓట్లతో బూడిద భిక్షమయ్య రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) అభ్యర్థిగా బరిలోకి దిగిన మోత్కుపల్లి నర్సింహులు నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. గతంలో ప్రత్యర్థులుగా ఎవరికి వారే రాజకీయ చక్రం తిప్పిన నేతలంతా ఇప్పుడు ఒకే పార్టీలో చేరితే రాబోయే ఎన్నికల్లో టికెట్ చేజిక్కించుకునెదెవరు? పార్టీలో ప్రాధాన్యత దక్కించుకునేది ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. గత ఎన్నికల్లో రెండు స్థానంలో నిలిచిన బూడిద భిక్షమయ్య టీఆర్ఎస్‌లో చేరితే నాలుగో స్థానంలో నిలిచిన మోత్కుపల్లికి కారు పార్టీలో స్పేస్ ఎంత మేర ఉంటుందనేది చర్చకు దారితీస్తోంది.

కారు ఓవర్ లోడ్:

నిజానికి టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఓవర్ లోడ్ అయింది. ఇందుకు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణం. గతంలో అవసరం లేనప్పటికీ ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆ స్థాయి నేతలను భారీగా పార్టీలోకి వలసలను ప్రోత్సహించారు. దీంతో ఇప్పుడు కారు ఓవర్ లోడ్ అయింది. కొన్ని చోట్ల టీఆర్ఎస్‌ను ఓడించిన ఇతర పార్టీ నేతలను ఆహ్వానించి అందలం ఎక్కించడంపై సొంత పార్టీలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమ ఓటమి కోసం పని చేసిన వారికి, ఓటమికి కారణం అయిన వారిని కేసీఆర్ ఆదరించడం పట్ల అసంతృప్తి రగులుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా ఎప్పటి నుండో టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న సీనియర్లు పార్టీలో ఇమడలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటి వారంతా అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని ఛాన్స్ వస్తే కారు దిగి పక్క పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ను వదిలి టీఆర్ఎస్‌లోకి వస్తున్న నేతలకు ఇప్పటికే పార్టీలో కొనసాగుతున్న వారితో సమస్యలు తప్పనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి చేరికల అంశం అన్ని పార్టీలకు ఓ టాస్క్‌గా మారిన నేపథ్యంలో టీఆర్ఎస్ తన బలప్రదర్శన కోసం ఇన్నాళ్లు ప్రోత్సహించినట్లుగానే ఇకపై కూడా చేరికలను ప్రోత్సహిస్తే సొంత పార్టీ నేతల్లో కుమ్ములాట తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed