బీఆర్ఎస్ విలీనం వార్తలపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు రియాక్షన్.. వారికి వార్నింగ్

by Gantepaka Srikanth |
బీఆర్ఎస్ విలీనం వార్తలపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు రియాక్షన్.. వారికి వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అంటూ వస్తోన్న వార్తలపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే పార్టీపై కుట్రలు జరిగాయని అన్నారు. ఇలాంటి కుట్రలను ఎదుర్కోవడం తమకు కొత్తేం కాదని తెలిపారు. తాజాగా బీజేపీలో విలీనం అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. వీటిని ఎవరూ నమ్మొద్దని చెప్పారు. ఏ పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండిపోదు.. మళ్లీ అంతే వేగంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కొన్ని రోజులైతే మళ్లీ ప్రజలే మార్పు కోరుకుంటారని తెలిపారు. ప్రస్తుతం తమకు ఏ కూటమిలో చేరే ఆలోచన లేదని అన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కేటీఆర్ కూడా విలీనం వార్తలపై ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలని.. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 24 ఏళ్లుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ తమదని చెప్పుకొచ్చారు. ఇవన్నీ దాటుకొని 24 ఏండ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ వివరించారు.

Advertisement

Next Story

Most Viewed