‘మా అమ్మ మారదు.. నేను మారను’.. పార్టీ చేంజ్ వార్తలపై మాజీ మంత్రి సబితా కుమారుడు క్లారిటీ

by Satheesh |
‘మా అమ్మ మారదు.. నేను మారను’.. పార్టీ చేంజ్ వార్తలపై మాజీ మంత్రి సబితా కుమారుడు క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘మా అమ్మ పార్టీ మార‌దు.. నేను పార్టీ మార‌ను.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు ప‌టోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు. నాడు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మారామని, కానీ రాజకీయ అవసరాల కోసం, పద‌వుల కోసం మారలేదని వెల్లడించారు. పార్టీలు మారే సంస్కృతి కూడా మాకులేదన్నారు. తెలంగాణ‌లో క‌క్షపూరిత రాజ‌కీయాలు కొన‌సాగుతున్నాయని, బీఆర్ఎస్ నాయ‌కులు, కార్యక‌ర్తల మీద కేసులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజా స‌మ‌స్యల‌పై కొట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కూడా కేసులు న‌మోదు చేస్తున్నారని, ఇలా ఎమ్మెల్యేల‌పై కేసులు ఎక్కడా న‌మోదు కాలేదన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల‌కు పాల్పడుతున్నదని, ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీల‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్నారన్నారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులు స‌రికాదు అని చెబుతుంటే రాష్ట్రంలో మాత్రం రేవంత్ రెడ్డి ఫిరాయింపుల‌కు పాల్పడుతున్నారని, టీ పీసీసీ.. ఏఐసీసీలో భాగం కాదా..? అని ప్రశ్నించారు.

బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యాడ‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు వ్యాఖ్యానించ‌డం స‌రికాద‌ని, కాంప్రమైజ్ అయితే ఎమ్మెల్సీ క‌విత ఎందుకు జైల్లో ఉంట‌ది..? అని ప్రశ్నించారు. ప‌నిక‌ట్టుకుని కేసీఆర్‌పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అక్కసు వెళ్లగ‌క్కుతున్నాయన్నారు. ఈ రెండు జాతీయ పార్టీల వ్యవ‌హార‌శైలిని ప్రజ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. తెలంగాణ రాష్ట్రానికి కవచం లాంటి పార్టీ బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కోసం పాటుపడుతుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టేలా బీజేపీ వ్యవరిస్తుందని, దీనికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలుకుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ప్రతి పక్షంలో కూర్చోబెట్టడం ఖాయం అనిఅన్నారు.

Advertisement

Next Story

Most Viewed