Jagdish Reddy: ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలియదా?

by Gantepaka Srikanth |
Jagdish Reddy: ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్‌కు తెలియదా?
X

దిశ, వెబ్‌డెస్క్: ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో ప్రభుత్వం ఆడుకుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagdish Reddy) ఆవేదన చెందారు. మంగళవారం తెలంగాణ భవన్‌(Telangana Bhavan)లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవైపు రివ్యూ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) డ్రామాలు ఆడుతూనే.. మరోవైపు ప్లాన్ ప్రకారం మిల్లర్లను, దళారీలను రైతుల మీదకు వదిలారని అన్నారు. దీని వెనుక వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. మంత్రులు దళారులతో, మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని అన్నారు. పదేళ్ల కాలంలో కేసీఆర్(KCR) పండిన ప్రతి గింజను కొన్నారని గుర్తుచేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరిస్తున్నారు. దళారులతో కుమ్మక్కయ్యే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2014కు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి. రైతులు మళ్లీ దోపిడీకి గురవుతున్నారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇప్పటివరకు ఒక్క గింజ సన్న వడ్లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదు అని అన్నారు. రైతులకు సమాధానం చెప్పేందుకు అధికారులు భయపడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజలు కేసీఆర్‌ను మర్చిపోయారు అంటూనే.. కేసీఆర్‌ను తలుచుకొని రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నించారు. కొడంగల్‌లో అధికారులపై జరిగిన దాడి ఘటనతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని అన్నారు. కేసీఆర్‌ను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి రేవంత్ రెడ్డి టైం పాస్ చేస్తున్నారని సీరయస్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ(Congress party)ని వాడుకుని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డిని చూసి భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.

చెడ్డ పేరు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని వెల్లడించారు. కొడంగల్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. మేధావులు, ఆచార్యులు కొడంగల్‌కు వెళ్లి వాస్తవ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని అన్నారు. ఢిల్లీకి 25 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి.. అక్కడ ఎవరి కాళ్లు మొక్కారని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? అక్కడ ఎవరిని కలిశారు? మీ ఇంటెలిజెన్స్‌తో కనుక్కోండి అని సూచించారు. కాంగ్రెస్, బీజేపీల బండారం బయటపెట్టడానికే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని అన్నారు. ఏ సమయంలో బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసు అని స్పష్టం చేశారు. ప్రజలు మర్చిపోవడానికి కేసీఆర్ వ్యక్తి కాదని.. ఒక శక్తి అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed