ఆ నిర్ణయం కేబినెట్‌దే: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై మాజీ సీఎస్ కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-12-18 17:21:01.0  )
ఆ నిర్ణయం కేబినెట్‌దే: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపై మాజీ సీఎస్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలనేది క్యాబినెట్ నిర్ణయమని, ఏ ఒక్కరి నిర్ణయం కాదని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్​కే జోషి తెలిపారు. మేడిగడ్డ ఏ విధంగా సౌలభ్యంగా ఉంటుందో గూగుల్​మ్యాప్​ ద్వారా పరిశీలించారన్నారు. ప్రభుత్వం, క్యాబినెట్​అంటే ముఖ్యమంత్రి ఒక్కరే కాదన్నారు. మేడిగడ్డ వద్ద వరుసగా మూడు సంవత్సరాలు అంచనా వేసిన దాని కంటే ఎక్కువగా వరదలు రావడం, ఆ వరదలను సరిగా నిర్వహించకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని మాజీ నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​కుమార్​తెలిపారు.

కాళేశ్వరం విచారణలో భాగంగా బుధవారం నీటిపారుదల శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్​ కుమార్, ఎస్​కే జోషిలను విచారించారు. 2008లో ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి(పీసీఎస్ఎస్​)ను చేపట్టారని, ఈ ప్రాజెక్టు పనులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి 7.7 శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయని ఆయన తెలిపారు. అప్పుడు ఏర్పడిన తెలంగాణ నూతన ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను అన్నింటిని సమీక్షించిందని, దానిలో బాగంగా పీసీఎస్ఎస్​ప్రాజెక్టును కూడా సమీక్షించిందన్నారు. అక్కడ నిర్మాణం సాధ్యం కాదనే ఉద్దేశంతో అక్కడ కాకుండా మరోక చోట నిర్మించాలని నిర్ణయించారన్నారు. సీడబ్య్లుసీ కూడా ప్రాణహిత వద్ద నీటి లభ్యత తక్కువగా ఉందని నివేదిక ఇచ్చిందన్నారు. తమ్మిడిహెట్టి నిర్మించడానికి మూడు దశల్లో చర్చలు జరిపామనర్నారు. ఇంజనీర్లు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, మంత్రుల స్థాయిలో చర్చలు జరిగాయన్నారు. ప్రాజెక్టుల రివ్యూల సందర్భంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇంజనీర్లు, సలహాదారులు కూర్చోని చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఆ నిర్ణయాన్ని క్యాబినెట్​ముందు పెట్టి సమీష్ఠి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. క్యాబినెట్​నిర్ణయం అంటే ప్రభుత్వ నిర్ణయమని, ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదన్నారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు కలిపితే ప్రభుత్వానిగా పరిగణిస్తారని అన్నారు. ఒకరిదిగా దీనిని అభివర్ణించలేమన్నారు. బ్యారేజీలు ఎక్కడైతే బాగుంటుంది, నీటి లభ్యత ఎక్కడ ఉన్నాయనేది పూర్వకాలంలో లాగా కాకుండా గూగుల్​మ్యాప్​సహాయం చేయడం జరిగిందన్నారు. క్యాబినెట్‌లో పెట్టినప్పుడు ఈ స్థలంపై ఏ ఒక్క మంత్రి కూడా డిసెంట్​నోట్ ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం అనేది 28 ప్యాకేజీలు, 8 లింక్​లు ఉంటాయన్నారు. స్టేట్​లెవల్​స్టాండర్డ్​కమిటీ (ఎస్ఎల్ఎస్ సీ) సమావేశమై నీటిపారుదల శాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ఇంటర్నల్ బెంచ్ మార్క్​కమిటీ డిజైన్​లను సిద్దం చేస్తుందని, సాంకేతికంగా సూచనలు చేస్తుందన్నారు.

నీటిపారుదల శాఖ ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్​కుమార్​మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన విధంగా తమ్మిడిహెట్టి వద్ద కొనసాగిస్తే మహరాష్ట్రలోని 3వేల ఎకరాలు ముంపునకు గురవుతుందని, దానితో పాటుగా వైల్డ్​లైఫ్​అభయారణ్యం ఉందని ఆయన తెలిపారు. ముంపును తగ్గించడం, అక్కడ నీటి లభ్యత కూడా తక్కువగా ఉండటం తదితర కారణాలతో అక్కడి నుంచి మేడిగడ్డకు మార్చారని తెలిపారు. గతంలో 16 టీఎంసీ నిల్వ సామర్ధ్యం ఉంటే దానిని మరో 47 టీఎంసీలు పెంచారని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అసెంబ్లీ పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మేడిగడ్డ ప్రారంభించాక వరుసగా మూడు సంవత్సరాల పాటు వరదలు భారీగా వచ్చాయని అన్నారు. ఆ సమయంలో వరదల నీటి నిర్వహణలో వైఫల్ కావడంతో సమస్యలు వచ్చాయని తెలిపారు. అధిక వరదలు, నిర్వహణ సమస్యలతో రివర్​బెడ్‌లో, ఫౌండేషన్‌లో సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు. దీంతో కాంక్రిట్​నిర్మాణం దెబ్బతిందన్నారు. అంచనా వేసిన దాని కంటే ఎక్కువ వరద వచ్చిందన్నారు. ఏ గ్రేడ్​ కాంట్రాక్టర్లు పనులు చేశారని, డ్యాంకుల భద్రత అనేది ఈఎన్​సీకి సంబంధించిన అంశంగా ఆయన తెలిపారు. నీటిని నిల్వ, వరద ప్రవాహం సరిగా నిర్వహించలేదన్నారు.

బ్యారేజీల వద్ద సరియైన విధంగా వరద ప్రవాహాన్ని పర్యవేక్షణ చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా సంపూర్ణంగా పూర్తి కాలేదని, ఆ ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత పరిశ్రమల అవసరాలకు నీటిని సరఫరా చేస్తే ఆదాయం వస్తుందని ఆయన తెలిపారు. నిపుణుల కమిటీ చైర్మన్​ సీబీ కామేశ్వర్​రావు కాళేశ్వరం కమిషన్​ ముందు అఫడవిట్ సమర్పించారు. తాను ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. గురువారం మరో ముగ్గురు అధికారులను విచారణ చేయనున్నారు. మాజీ సీఎస్​సోమేశ్​కుమార్, వికాజ్ రాజ్, స్మితా సభర్వాల్​లను విచారించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed