ప్రైవేట్ కాలేజీ నిర్వాకం.. శ్రీ గాయత్రి కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

by Bhoopathi Nagaiah |
ప్రైవేట్ కాలేజీ నిర్వాకం.. శ్రీ గాయత్రి కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
X

దిశ, జనగామ: జనగామ జిల్లాలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రైవేట్ కాలేజీలకు చెందిన హాస్టల్స్‌లోనే ఈ సంఘటనలు జరుగుతుండటం విస్మయానికి గురి చేస్తోంది. మొన్న ఏబీవీ కళాశాల హాస్టల్లో జరగ్గా.. నేడే జిల్లా కేంద్రంలోని శ్రీ గాయత్రి జూనియర్ ప్రైవేట్ కళాశాల హాస్టల్‌లో వెలుగుచూసింది. హాస్టల్ విద్యార్థినీలు తెలిపిన వివరాల ప్రకారం..

శ్రీ గాయత్రి జూనియర్ ప్రైవేట్ కళాశాల హాస్టల్‌లో గురువారం రాత్రి పాలకూర పప్పుతో భోజనం చేసిన విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. హాస్టల్‌లోని 10 నుంచి 15 మంది విద్యార్థినీలు అస్వస్థత గురికావడంతో కళాశాల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఆర్ఎంపీతో రహస్యంగా చికిత్స అందించినట్టు సమాచారం. కానీ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారం క్రితమే ఇదే యాజమాన్యానికి సంబంధించిన ఏబీవీ బాయ్స్ జూనియర్ కళాశాల హాస్టల్‌లోనూ ఫుడ్ పాయిజన్ అయింది. ఈ ఘటన మరువక ముందే ఇప్పుడు అదే యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న మరో కళాశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కావడం జిల్లాల్లో కలకలం సృష్టిస్తోంది.

మరోవైపు విద్యార్థుల ఆరోగ్యం విషయంలో కాలేజీ యాజమాన్యం కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలకు ఈ నెల 2వ తేదీ నుంచే దసరా సెలువులు ఇచ్చినా కళాశాల యజమాన్యం మాత్రం నిబంధనలు ఉల్లంఘించి ఇంకా హాస్టల్‌లోనే విద్యార్థినీలను ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed