Mahaboobnagar: 12 స్థానాల్లో గట్టి పోటీ.. 2 స్థానాల్లోనే బీఆర్ఎస్‌ గెలుపంటూ సర్వేలు

by srinivas |   ( Updated:2023-12-01 05:51:44.0  )
Mahaboobnagar: 12 స్థానాల్లో గట్టి పోటీ.. 2 స్థానాల్లోనే బీఆర్ఎస్‌ గెలుపంటూ సర్వేలు
X
  • 12 స్థానాల్లో అధికార పార్టీకి గట్టి పోటీ
  • ‘దిశ’ పరిశీలనలో 6 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
  • ఓటర్లపై ప్రభావం చూపని మద్యం, డబ్బు

దిశ,మహబూబ్ నగర్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందంటూ పోలింగ్ సరళిని అనుసరించి సర్వే సంస్థలు ప్రకటించాయి. గత రెండు నెలలుగా ఉత్కంఠను రేపిన అసెంబ్లీ ఎన్నికలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. ఇప్పటివరకు 14 కు 14 స్థానాలు అధికార బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉండగా ఈసారి ఆ పార్టీ అంచనాలు తలకిందులు అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగా సర్వే సంస్థలు ఫలితాలను అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రకటించాయి.

ఆయా సంస్థలు ప్రకటించిన వివరాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకుగాను ఈసారి అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగలనున్నట్లు ఫలితాలు ప్రకటించాయి. చాణక్య సంస్థ బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేవలం రెండు స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు దక్కనున్నట్లు ప్రకటించింది. మరొక స్థానంలో నువ్వా నేనా అన్నట్లు ఉందని పేర్కొంది.

ఆరా సంస్థ- బీఆర్ఎస్‌కు 5 నుంచి 6 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 8 నుంచి 9 స్థానాలు దక్కనున్నట్లు పేర్కొంది. సి ప్యాక్ సంస్థ- బీఆర్ఎస్‌కు రెండు స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు దక్కనున్నట్లు ప్రకటించగా, పీటీఎస్ గ్రూప్ సంస్థ బీఆర్ఎస్ కు 2 నుంచి 4 స్థానాలు వస్తాయని ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 12 స్థానాలు దక్కనున్నట్లు ప్రకటించింది.

'దిశ పరిశీలనలో...

ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన ఎన్నికలకు సంబంధించి దిశ బృందంతోపాటు వివిధ మార్గాల ద్వారా సేకరించిన ప్రకారం 13 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 6 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, అలంపూర్, మక్తల్, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జడ్చర్ల, వనపర్తి, నారాయణపేట, గద్వాల, దేవరకద్ర నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా కొనసాగింది. వీరిలో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతో బయటపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అభ్యర్థులు సులభంగా విజయం సాధిస్తారు అన్న నమ్మకం కేవలం రెండు నియోజకవర్గాలలో మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటర్లే ఈరోజు.. నాయకులు అంతా డమ్మీలు

ఈ ఎన్నికలలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గతంలో ఆయా పార్టీల నాయకులు కార్యకర్తల ప్రభావితం, డబ్బులు, మద్యం తీసుకోవడం ద్వారా ఓటర్లు కొంత ప్రభావితం అయ్యేవారు. కానీ ఈ ఎన్నికలలో పరిస్థితి భిన్నంగా కొనసాగింది. ఆయా పార్టీలు ఇచ్చే మద్యం డబ్బులు అందిన, అందకున్నా నాయకులతో సంబంధం లేకుండా ఓటర్లు తమకు ఇష్టమైన పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేశారు.

Advertisement

Next Story