అధికారులు చేతులెత్తేశారు?.. నాలుగు రోజులుగా ముంపులోనే కాలనీలు

by Gantepaka Srikanth |
అధికారులు చేతులెత్తేశారు?.. నాలుగు రోజులుగా ముంపులోనే కాలనీలు
X

దిశ, పటాన్ చెరు: గత నాలుగు రోజులుగా చిట్కుల్ పంచాయతీ పరిధిలోని నాగార్జున కాలనీ, రాధమ్మ కాలనీ, పార్థ సారథి నగర్ కాలనీలు ముంపులో ఉన్నా.. అధికారులు కనీస చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. వరద నీటిని మళ్లించి కాలనీ ప్రధాన రహదారిని వరద నీటి ముంపు నుంచి రక్షించే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా అసలు ప్రయత్నాలు చేయలేరని పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. ముంపు సమస్యపై గత నాలుగు రోజుల నుంచి కాలనీవాసులు ఆందోళన చెందుతున్నా.. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ముత్తంగి చెరువు కింద ప్రధాన వరద కాలువను ఆక్రమించి పెట్రోల్ బంక్‌తో పాటు పలు అక్రమ నిర్మాణాలు వెలువడంతో వరద నీరంతా ముత్తంగి, చిట్కుల్‌లోని కాలనీల గుండా ప్రవహిస్తూ రోడ్లను, ఖాళీ స్థలాలని వరద ముంచెత్తింది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో 8 కాలనీల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

వరద నీరు, రోడ్లపై ప్రవహిస్తూ ఖాళీ స్థలాలు ఇండ్ల పరిసరాలు నదులను తలపిస్తున్నా.. ‘మీ చావు మీరు చావండి’ అంటూ అధికారులు ప్రజల కష్టాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వరదనీటి సమస్యపై కాలనీవాసులు ఇప్పటికే నీటిపారుదల రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా.. తూ తూ మంత్రంగా ఒకసారి పర్యటించి వెళ్లిపోయారు. కానీ వరద సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత నాలుగు రోజుల నుంచి కాలనీలు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడం, అధికారులు ఈ సమస్యను గాలి కొదిలేయడంతో అధికారుల తీరుపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారులకు ఆర్థిక లావాదేవీల్లో ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలపై లేకపోవడం పట్ల మండిపడుతున్నారు. ఈ సమస్య జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్తే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కాలనీ వాసులు ఆశించినా.. ఇప్పటివరకు సమస్య పరిష్కారనికి చొరవ చూపలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై స్పందించి త్వరితగతిన వరద సమస్యను తీర్చాలని, వరద కాలువను పునరుద్ధరించి భవిష్యత్తులో ముంపుకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed