తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్! గాంధీ భవన్ ఎదుట ఫ్లెక్సీల కలకలం!

by Disha Web Desk 14 |
తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్! గాంధీ భవన్ ఎదుట ఫ్లెక్సీల కలకలం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు వేళ ఫ్లెక్సీ వార్ మళ్లీ మొదలైంది. బీజేపీని టార్గెట్ చేస్తూ గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో పదేండ్ల మోసం పదేండ్ల విధ్వంసం పేరుతో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. దీనికి సంబంధించిన పోస్టర్లను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దేశం నుంచి బ్లాక్ మనీ తుడిచిపారేస్తాం.. అని ఇచ్చిన హామీపై ఎలక్టోరల్ బాండ్ల వ్యవహరం గురించి విమర్శిస్తూ పోస్టర్‌లో ఉంది. రూపాయి పంపిస్తే, 43 పైసల బిచ్చం ఇస్తాం తెలంగాణకు అని ప్రధాని మోడీ కార్టూన్ పెట్టారు. మా 15 లక్షలు ఎక్కడ మోడీ?, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, పదేండ్లలో మూడింతలైన దేశం అప్పు, 2014 వరకు అప్పు రూ. 55 లక్షల కోట్లు మాత్రమే, 2014లో అప్పు రూ. 183.67 లక్షల కోట్లు అని పోస్టర్‌లో ఉంది. తెలంగాణకు బీజేపీ గత పదేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని, కృష్ణా జలాల్లో వాటా తదితర అంశాలతో పోస్టర్లలో పేర్కొన్నారు.

తెలంగాణకు బీజేపీ చేసిన ద్రోహాల చిట్టా అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ‘నయవంచన’ పేరుతో చార్జిషీట్ విడుదల చేసింది. బీజేపీ పదేండ్ల పాలనలో దేశాన్ని సర్వనాశనం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘పదేళ్ల కన్నీళ్ళని యాదుంచుకుందాం.. ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం’ అని టీ కాంగ్రెస్ పిలుపు నిచ్చింది. కాగా, దీనిపై బీజేపీ పార్టీ వర్గాలు ఫైర్ అయ్యాయి. వారు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.



Next Story

Most Viewed