- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో తొలి ఎన్నికలు
దిశ, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో 1957లో 105 స్థానాలకు జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాలను కైవసం చేసుకొని ఆధిక్యత నిలబెట్టుకుంది. 1952తో పోలిస్తే బలం కోల్పోయిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) 20 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అప్పటికే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడింది. అయితే.. కోస్తాంధ్ర, రాయలసీమలో 1955లోనే 167 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 29 నియోజక వర్గాలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేవారు. దీంతో మొత్తం 196 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 119 చోట్ల విజయం సాధించింది. అప్పుడు గెలిచిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలను, 1957లో గెలిచిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో కలిపి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తదుపరి ఎన్నికలు 1962లో జరగడంతో 1955లోనే గెలిచిన కోస్తాంధ్ర, రాయలసీమ ఎమ్మెల్యేల పదవీ కాలం రెండేళ్లు అదనంగా అంటే.. ఏడేళ్ల పాటు కొనసాగడం విశేషం. అప్పటికే కోస్తాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కొనసాగారు.
రెడ్ల ఆధిక్యత..
1952లో జరిగిన హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు ఎక్కువగా గెలిస్తే.. 1957లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఆధిక్యత కనబడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన 30 మంది రెడ్లలో 17 మంది కాంగ్రెస్ తరఫున, 8 మంది పీడీఎఫ్ తరఫున, ఐదుగురు ఇండిపెండెంట్లుగా విజయం సాధించారు. 22 మంది ఎస్సీలు, 18 మంది బ్రాహ్మణులు, 10 మంది వెలమలు, ఏడుగురు ముస్లింలు, ఆరుగురు బీసీలు, నలుగురు కమ్మ వర్గం వారు, ఇద్దరు చొప్పున వైశ్యులు, లింగాయత్ లు గెలిచారు. కాంగ్రెస్ నుంచి పీవీ నరసింహారావు, హయగ్రీవా చారి, నూకల రామచంద్రారెడ్డి, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, మాసూమా బేగం, నవాబ్ జంగ్, సీతయ్య గుప్తా, జి.వెంకటస్వామి, జె.చొక్కారావు తదితర ప్రముఖులు విజయం సాధించారు. పీడీఎఫ్ తరఫున భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ధర్మభిక్షం, చెన్నమనేని రాజేశ్వరరావు, కేఎల్ నరసింహారావు తదితర ప్రముఖులు గెలుపొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1957-62) ముఖ్యమంత్రులు
నీలం సంజీవరెడ్డి.... 1956 నవంబర్ 1 నుంచి 1960 జనవరి 11 వరకు.... మూడేళ్ల 71 రోజులు
దామోదరం సంజీవయ్య.... 1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 12 వరకు... రెండేళ్ల 60 రోజులు
1957లో తెలంగాణలో వివిధ పార్టీల బలాలు
కాంగ్రెస్.... 68
పీడీఎఫ్.... 22
ప్రజా సోషలిస్టు పార్టీ.... 1
ప్రజా పార్టీ.... 1
ఇతరులు.... 1
ఇండిపెండెంట్లు.... 12
మొత్తం.... 105
1955లో ఆంధ్రప్రదేశ్ లో వివిధ పార్టీల బలాలు
కాంగ్రెస్.... 99
క్రిషికార్ లోక్ పార్టీ.... 21
సీపీఐ.... 12
ఇండిపెండెంట్లు.... 19
ఇతరులు.... 16
మొత్తం.... 167