bonala Festivals : అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు..

by Sumithra |
bonala Festivals : అంగరంగ వైభవంగా పాతనగర బోనాల ఉత్సవాలు..
X

దిశ, చార్మినార్​ : బోనాల పండుగ పర్వదిన వేడుకలను పాతబస్తీ ప్రజలు ఆదివారం భక్తిశ్రద్దలతో కన్నుల పండువగా జరుపుకున్నారు. సుధూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనం, నైవేద్యం, సాక సమర్పించి తమ కుటుంబాలను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. గత తొమ్మిది రోజులుగా ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించిన భక్తులు పర్వదినాన అమ్మవారికి బోనాలు సమర్పించి తమ భక్తి ప్రవత్తులను చాటుకున్నారు. దక్షణమండలం డీసీపీ స్నేహ మెహ్రా ఆధ్వర్యంలో గట్టి పోలీస్​ బందోబస్తు నడుమ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాతనగరంలో పలు ప్రధాన దేవాలయాలతో పాటు వీధులు వేలాది మంది భక్తులతో క్రిక్కిరిశాయి. గంటల తరబడి క్యూలో నిలబడి మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. హుషారెత్తించే గీతాలు.. జానపదగేయాలు.. డప్పువాయిద్యాలు.. పోతరాజుల వీరంగం.. నృత్యాలు చేస్తూ పాతనగర వాసులు బోనాల పండుగ పర్వదినాన్ని అత్యంతవైభవంగా జరుపుకున్నారు.

తెలంగాణ ప్రాంతంలోనే అత్యంత వైభవంగా జరుపుకునే పాతబస్తీ బోనాల ఉత్సవాలకు ప్రముఖులతో పాటు సినీనటులు, మంత్రులు, ఎమ్మల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం రాకతో పాతబస్తీ సందడిగా మారింది. బాగ్యనగర్​ శ్రీ మహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు గాజుల అంజయ్య ఆధ్వర్యంలో పాతనగరంలోని 116వ ఉత్సవాలు జరుపుకుంటున్న లాల్​దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, హరిబౌళి శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, శ్రీ బంగారుమైసమ్మ దేవాలయం, మీరాలం మండి శ్రీ మహంకాళి దేవాలయం, చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయం, గౌలిపురా శ్రీ మహంకాళి దేవాలయం, ఉప్పుగూడ శ్రీ మహంకాళి దేవాలయం, మేకల్​బడం శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చందులాల్​ బేలాలోని శ్రీ ముత్యాలమ్మ దేవాలయం, అలియాబాద్​లోని శ్రీ దర్బార్​ మైసమ్మ దేవాలయం, చాంద్రాయణగుట్టలోని బంగారు మైసమ్మ దేవాలయం, శ్రీ కనకదుర్గ దేవాలయాలను ప్రముఖ సినీనటులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా ఆలయాలలో అమ్మవారికి మహాభిషేకం, బోనాల సమర్పణ, శాంతి కళ్యాణం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్రం ప్రభుత్వం తరపున పలు దేవాలయాలోని అమ్మవారికి పట్టువస్త్రాలు, శాంతి కళ్యాణం కోసం తలంబ్రాలను సమర్పించారు.

ప్రముఖుల సందర్శన....

ఆషాడమాసం బోనాల పండుగ పర్వదినం సందర్భంగా లాల్​దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయంతో పాటు పాతనగర అమ్మవారి ఆలయాలకు రాష్ట్రం ప్రభుత్వం తరపున రాష్ట్ర డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులు, మంత్రులు పొన్నం ప్రభాకర్​, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్​కుమార్​ యాదవ్​లు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భార్య నందిని మల్లు అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. రాష్ట్రప్రభుత్వం తరపున శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి అమ్మవారికి మంత్రి గుగ్గిళ్ల శ్రీధర్​ బాబు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్​ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారికి మంత్రి జూపల్లి కృష్ణరావు రాష్ట్రప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు.

అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​, హర్యానా గవర్నర్​ బండారు దత్త్రాత్రేయ, ఎంపీలు ఈటెల రాజేందర్​, చామల కిరణ్​కుమార్​ రెడ్డి, రాజ్య సభ సభ్యులు డాక్టర్​ కె.లక్ష్మణ్​​, ప్రభుత్వ విప్​, ధర్మగిరి ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్​, రామగుండం ఎమ్మెల్యే రాజ్​ ఠాకూర్​, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి,ఎమ్మెల్యే దానం నాగేందర్​, ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్​, తెలంగాణ మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్​, బీసీ ఫైనాన్స్​ కార్పొరేషన్​ చైర్మన్​ శ్రీకాంత్​, ప్లానింగ్​ కమిషన్​ వైస్​ చైర్మన్​ చిన్నారెడ్డి, పీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్​, టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న, బీజేపీ నాయకులు చీకోటి ప్రవీణ్​కుమార్​, కంటెస్టెడ్​ ఎమ్మెల్యేలు ఫేరోజ్​ ఖాన్​, కోట నీలిమ, బోయ నాగేష్​, వివిధ ఆలయ కమిటీ చైర్మన్​లు రాకేష్​ తివారి, సి.రాజేందర్​యాదవ్​, పొటేల్​ సదానంద్​ యాదవ్​, జనగామ మధుసూధన్​గౌడ్​, ఎర్మని కైలాష్​, పొన్న వెంకటరమణ, ఆదర్లమహేష్​, బాశెట్టి లెనిన్​బాబు, జోగిని శ్యామల, దేవాదాయ శాఖ కమిషనర్​ హనుమంత్​రావు​, లాల్​ దర్వాజా సిఎఫ్​ఓ అంజనారెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గీతారెడ్డి తదితరులు సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బంగారు బోనం సమర్పించిన ప్రముఖులు...

రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని మల్లు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి సతీమణి కావ్య కిషన్​రెడ్డి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్​, హైకోర్టు జడ్జి సూర్యపల్లి నంద, గోదావరిఖని సివిల్​ జడ్జి రామగిరి సారిక, హైదరాబాద్​ కంటెస్టెడ్​ ఎంపీ మాధవిలత, నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి తదితరులు అమ్మవారి ఆలయాలను సందర్శించి, బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులకు ఆలయ కమిటీ చైర్మన్ సి.రాజేందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మారుతీ యాదవ్, కోశాధికారి పోసాని సతీష్​ ముదిరాజ్, కన్వీనర్ అరవింద్ కుమార్, మాజీ చైర్మన్ లు కె. వెంకటేష్, మాణిక్ ప్రభుగౌడ్, టి. నర్సింగ్​రావు​, బంగ్లారాజు తదితరులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

బోనాల ఉత్సవాల కోసం రూ.20 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బోనాల పండుగ అనేది భూమి పుత్రులు జరుపుకునే పండుగ. అందుకని ఈ పండుగకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దుష్టశక్తుల గాలీ, దుమారం నగరం పై, నగరంలో ఉన్న కుటుంబాల పై పడకుండా మమ్మల్ని కాపాడు శ్రీ మహంకాళి తల్లీ అని వేడుకుంటూ నిర్వహించదగ్గ గొప్ప పండుగ బోనాల పండుగ. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ విజయవంతం కోసం ప్రభుత్వం తరఫున అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాం. నగరంలోని అన్ని దేవాలయాలకు సమృద్ధిగా నిధులు ఇచ్చి బోనాలు ఉత్సవాలను ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను విడుదల చేసింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి పటిష్టమైన పునాదులు వేయడానికి ముందుచూపు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పుడున్న హైదరాబాద్ అభివృద్ధి అంతా కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది.

ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపుతో వేసిన పునాదుల వల్లే హైదరాబాదులో ఎకో సిస్టం డెవలప్మెంట్​ అయ్యింది. హైదరాబాదులో ఇప్పుడు ఉన్న ఈసీఐఎల్ బీహెచ్ఇఎల్, బీడీఎల్, డీఆర్డీఓ తదితర సంస్థలు రావడానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పునాదులు వేయడం వల్లనే అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఇక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పటిష్టమైన శాంతిభద్రతలు నెలకొల్పడానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. సేఫ్టీ నగరంగా హైదరాబాదును మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నదని, భయాందోళన లేకుండా హైదరాబాదు నగరంలో ప్రశాంతంగా జీవించవచ్చన్న నమ్మకం, ధైర్యాన్ని కాంగ్రెస్ పాలన ప్రజలకు అందిస్తోందన్నారు. సింహవాహిని మహంకాళి తల్లీ.. చల్లగా చూడు.. హైదరాబాదు నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండే విధంగా దీవించాలని రాష్ట్రప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకున్నారు.

తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి సారి జరుపుకునే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గోల్కొండలో ప్రారంభమైన బోనాల పండుగ బల్కంపేట్ ఎల్లమ్మ కళ్యాణం, ఉజ్జయిని మహంకాళి బోనం, లాల్ దర్వాజా బోనంతో తెలంగాణ సమృద్ధిగా ఉండాలని వర్షాలు మంచిగా కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని జరువుకునే పండుగ బోనాల పండుగ. హైదరాబాద్ సంస్కృతికి, సంప్రదాయానికి నిలువు బోనాల పండుగ.

భాగ్య లక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నానన్నారు. గత సంవత్సరంలో వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ఈ సారి ఇప్పటికే పూర్తి స్థాయిలో వర్షాలు పడ్డాయని, రైతులంతా సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11లక్షల మంది రైతులకు రూ.7వేల కోట్లు రుణ మాఫీ చేశామని, మరోవారం రోజుల్లో మరో రూ.15వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేయనున్నట్లు తెలిపారు. మరో రూ.2లక్షల రుణ మాఫీ చేస్తే తెలంగాణ ప్రజలను బీదరికం నుంచి బయట పడుతున్నారన్నారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయం పాతబస్తీకి మెట్రో రైలు రాకతో ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారనుంది.

బోనాల ఉత్సవాలు తెలంగాణ లోనే ప్రత్యేకం : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

బోనాల ఉత్సవాలు తెలంగాణలోనే ప్రత్యేకం అన్నారు. బోనాలు, బతుకమ్మ పండుగలు మహిళలు అమ్మవారిని ఆదరించే పండుగలని, పవిత్రమైన భావనతో బోనాలు సమర్పించి భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని, అలాగే జీవితంలో వచ్చే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొనే శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని కోరారు. తెలంగాణ ఇంకా అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, పాతబస్తీలో ప్రజలు శాంతి సామరస్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. మహిళలను గౌరవించడమే అమ్మవారి పట్ల మనకు ఉన్న నిజమైన భక్తి అని తెలిపారు.

లాల్ దర్వాజ బోనాలకు హైదరాబాద్ లోనే ప్రత్యేక స్థానం : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

లాల్ దర్వాజ అమ్మవారి బోనాలకు హైదరాబాద్ లో ప్రత్యేక స్థానముందన్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల భాగ్యాలు కలుగుతాయని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయాని ప్రజల ప్రగాఢ విశ్వాసంతో ఆరాధిస్తారన్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అందరి పై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed