రేపటి పోలింగ్ కు రెయిన్ ఫియర్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

by Prasad Jukanti |   ( Updated:2024-05-12 14:12:41.0  )
రేపటి పోలింగ్ కు రెయిన్ ఫియర్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచన చేసింనందునా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తక్షణం సంబంధిత శాఖ‌ల అధికారులు, సిబ్బంది తగిన స‌హాయ‌క చర్యలు చేపట్టాలన్నారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలి వాన, పిడుగులతో బీభత్సం సృష్టించింది. ఐకేపీ సెంటర్ వద్ద మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామానికి చెందిన తాత మనువడు పిడుగుపాటుకు మృతి చెందగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపడి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చనిపోయిన బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి తగిన వైద్య సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచిపోతే రైతులు ఆందోళన చెందవద్దని సీఎం హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద గాలివాన బీభత్సం:

రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ధాన్యం తడిచిపోయింది. వానతో పాటు ఈదురు గాలుల కారణంగా ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది అవస్థలు పడ్డారు. జహీరాబాద్, కామారెడ్డి, ఆసీఫాబాద్ తో పాటు మరికొన్ని చోట్ల ఏర్పాట్లు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేసిన టెంట్ల నుంచి వర్షం నీరు కారడం, టెంట్లు కూలడంతో ఎన్నికల సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. ఈవీఎం మెషీన్లు, కంట్రోలింగ్ యూనిట్లు, ఈవీఎం ప్యాడ్లు తడవకుండా కాపాడుకునేందుకు సిబ్బంది నానా తంటాలు పడ్డారు. ఆసిఫాబాద్ లో ఎలాగోలా వర్షంలోనే ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్ బూత్ లకు బయలుదేరారు. వర్షాల కారణంగా సమస్యాత్మక కేంద్రాలకు పొలింగ్ సిబ్బంది వెళ్లడం ఇబ్బందిగా మారింది.

రేపటి పోలింగ్ కు రెయిన్ ఫియర్:

రాష్ట్రంలో రేపు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాబోతుండగా మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రేపటి పోలింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో వర్షం కురిస్తే ఓటర్లు తమ ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారనే సందేహం వ్యక్తం అవుతోంది. మరో వైపు వర్షం కారణంగా పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఆందోళన అభ్యర్థులో వ్యక్తం అవుతోంది.

Read More...

BREAKING: నగరవాసులకు బిగ్ అలర్ట్.. భారీ వర్షం కురిసే ఛాన్స్, అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

Advertisement

Next Story

Most Viewed