ఎంపీ టికెట్ కోసం తండ్రి కూతురు సై..టీకాంగ్రెస్ లో హాట్ టాపిక్

by Prasad Jukanti |
ఎంపీ టికెట్ కోసం తండ్రి కూతురు సై..టీకాంగ్రెస్ లో హాట్ టాపిక్
X

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ల కోసం ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. అసెంబ్లీఎన్నికల గెలుపు ఉత్సాహంతో ఉన్న పార్టీ నేతలు టికెట్ల వేట కోసం సై అంటే సై అంటున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకుంటే చాలు గెలుపు పక్కా అన్న ధీమాతో గాంధీ భవన్ కు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రాగా తాజాగా ఎంపీ టికెట్ల కోసం తండ్రి కూతురు అప్లికేషన్ పెట్టుకోవడం ఆసక్తిగా మారింది. పెద్దపల్లి లోక్ సభ టికెట్ కోసం మాజీ మంత్రి డాక్టర్ ఆగమచంద్రశేఖర్ దరఖాస్తు చేసుకోగా నాగర్న కర్నూల్ టికెట్ కోసం డాక్టర్ ఆగమ చంద్ర ప్రియా గురువారం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ తండ్రి కూతుర్లలో అధిష్టానం ఎవరికి ఎస్ చెబుతుంది మరెవరికి నో చెప్పబోతుంది అనేది గాంధీ భవన్ వర్గాల్లో చర్చగా మారింది. కాగా చంద్రశేఖర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

నేతల మధ్య తీవ్ర పోటీ:

పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టింది. ఏ మాత్రం ప్రత్యర్థికి అవకాశం లేకుండా అభ్యర్థు ఎంపికకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆశావాహుల నుంచి గాంధీ భవన్ లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తోంది. దీంతో ఇప్పటికే పోటీ చేయాలని భావిస్తున్న నేతలంతా తమ అభ్యర్థనను సమర్పించగా కొన్ని సెగ్మెంట్లలో ఆసక్తికరమైన పోటీ కనిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం టికెట్ కోసం పార్టీలోని సీనియర్ నేతలైన భట్టి విక్రమార్క సతీమణి నందిని, సీనియర్ నేత వీహెచ్ టికెట్ ఆశిస్తుండగా గతంలో ఖమ్మం ఎంపీగా పని చేసిన రేణుకా చౌదరి ఈ టికెట్ తనదే అంటూ ధీమాతో ఉన్నారు. ఇక భువనగిరి స్థానం విషయంలోనూ అదే ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఈ క్రమంలో అనూహ్యంగా చంద్రశేఖర్, ఆయన కూతురు ఇద్దరు టికెట్ కోసం దరఖాస్తు చేయడం చర్చగా మారింది.

Advertisement

Next Story