Farmers Loan : రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా? హరీష్ రావు

by Ramesh N |
Farmers Loan : రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా? హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పటికైనా కండ్లు తెరిచి రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ మంత్రి హారీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్య అని, పోలీసు యాక్ట్ పేరు చెప్పి, జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేని పేర్కొన్నారు.

రైతులకు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయారని, ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని, అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పెట్టించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. ఏకకాలంలో ఆగస్టు 15లోపు రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారన్నారు. నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మర్చిపోయినట్లు ఉన్నారని తెలిపారు. ఆదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed