కాంగ్రెస్‌‌లోకి మాజీ మంత్రి జూపల్లి.. చేరిక దాదాపు ఖరారు?

by GSrikanth |   ( Updated:2023-05-30 11:11:56.0  )
కాంగ్రెస్‌‌లోకి మాజీ మంత్రి జూపల్లి.. చేరిక దాదాపు ఖరారు?
X

దిశ బ్యూరో, మహబూబ్ నగర్: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైందని ఆయన అనుచర వర్గం చెబుతున్నారు. జూన్ 8వ తేదీన జూపల్లి కృష్ణారావు, వనపర్తి జిల్లా నేతలు మెఘారెడ్డి, కిచ్చారెడ్డి తో పాటు మరి కొంతమంది కలిసి పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. జూపల్లి కృష్ణారావు, ఆయన అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే ప్రచారం తెలిసి ఇప్పటికే ఆ పార్టీలో కొనసాగుతున్న పలువురు ముఖ్య నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆ పార్టీలో చేరడానికి ముందే తనతో పాటు కలిసి వస్తున్న పెద్దమందడి ఎంపీపీ మెఘా రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం నుంచి హామీ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొల్లాపూర్ నియోజకవర్గంలో జగదీశ్వరరావు, అభిలాష రావు టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ బలహీన పడకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. తప్పనిసరిగా ఈ ఇరువురిలో ఒకరికి వచ్చే ఎన్నికలలో టికెట్ వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తూ వచ్చాయి.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి చేరికతో పార్టీలో సమీకరణాలు మారనున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వనపర్తిలోనూ ఇదే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి టికెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకానొక సందర్భంలో మాజీ మంత్రి చిన్నారెడ్డికి వ్యతిరేకంగా పలువురు నాయకులు కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహించారు. కొల్లాపూర్ నియోజకవర్గం తరువాత, వనపర్తి నియోజకవర్గం పైనని జూపల్లి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పైగా కొల్లాపూర్ లో తనకు, వనపర్తి లో మెగా రెడ్డికి తప్పనిసరిగా టికెట్ ఇవ్వాలని ఒప్పందంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో ఇద్దరు కొట్లాడుతుంటే మూడో వ్యక్తికి లాభం అనే చందంగా పరిస్థితులు మారనున్నాయి.

ఇప్పటికే కొల్లాపూర్ నుంచి టికెట్ ఆశిస్తున్న అభిలాషరావు, జగదీశ్వరరావు, వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యువసేన రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని వారి వారి అనుచరగణం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రత్యేకించి కొల్లాపూర్ నియోజకవర్గంలో అభిలాషరావు అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహించే స్థితిలో ఉన్నా.. జూపల్లిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న జగదీశ్వర్ రావు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి ఈ ఎన్నికలు లో టికెట్ తనకే వస్తుంది అన్న ధీమాతో ఉన్నారు. మొత్తం మీద జూపల్లి కాంగ్రెస్‌లో చేరితే కొల్లాపూర్, వనపర్తి రాజకీయాలలో మార్పులు, చేర్పులు జరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Read More... కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం: మాజీ మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story