పోలీసులపై కాంగ్రెస్ సర్కార్ కర్కశత్వం.. హరీష్ రావు ఫైర్

by Y.Nagarani |
పోలీసులపై కాంగ్రెస్ సర్కార్ కర్కశత్వం.. హరీష్ రావు ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రూల్స్ మార్చుతూ పోలీసులపై ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్స్ వేదికగా మంగళవారంపై సీఎంపై ఫైర్ అయ్యారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్ళు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం దుర్మార్గం అన్నారు. వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక అని హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవ్ విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించిందని మండిపడ్డారు. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న టీఏ, ఎస్ఎల్, జీపీఎఫ్ లను వెంటనే విడుదల చేయాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు. సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం పోలీస్స్టేషన్ నిర్వహణ కోసం మండల పోలీసు స్టేషన్ కు 25వేలు, పట్టణానికి 50వేలు, హైదరాబాదులో 75వేలు ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నిర్వాణ కోసం నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. దీంతో పోలీసులు, పోలీస్ స్టేషన్ వెళ్లే ప్రజలపై భారం పడుతున్నదన్నారు. ఈ నిధుల విడుదల కోసం సీఐలు ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకంలో ఆర్థిక సహాయం పొందిన 65 మంది బీసీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిధులను విడుదల చేయడం లేదు? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనే సదుద్దేశంతో కేసీఆర్ రూపొందించిన ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందా? అని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలకు అర్థం ఇదేనా? అని నిలదీశారు. పేర్లు మార్చడం, విగ్రహాలు తొలగించడం సులభం కానీ హామీలను నిలబెట్టుకోవడం కష్టం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గుర్తుందా? మొదటి అసెంబ్లీ సమావేశంలో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ధ్వజమెత్తారు.

గణనీయంగా పెరిగిన నేరాల రేటు

హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగటం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని, నేరాల రేటు గణనీయంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నా ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదని, హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క నాడు సమీక్ష చేయడం లేదన్నారు. మహిళా భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం అన్నారు. అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed