అన్నీ ‘కోత’లే! ఎన్నికల వేళ BRSలో నయా టెన్షన్

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-18 17:10:08.0  )
అన్నీ ‘కోత’లే! ఎన్నికల వేళ BRSలో నయా టెన్షన్
X

సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది మరొకటి అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమానికి తెలంగాణ చిరునామాగా మారిందంటూ చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్.. పథకాలను అమలు చేయడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని స్కీంలు అటకెక్కాయి. మరికొన్ని పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని సైతం సర్కారు కుదిస్తున్నది. ఇవి భారీ ఖర్చుతో కూడుకున్నవి కావడంతో అనధికారికంగా వాటిల్లో మార్పులు చేస్తున్నది. రాష్ట్ర గల్లాపెట్టేలో పైసలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తున్నది.

తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల్లో అనధికారికంగా కోతలు అమలవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ అంచనాలకు తగినట్టుగా ఆదాయ వనరులు లేకపోవడంతో అనివార్యంగా కోత తప్పడంలేదు. ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వాటిపై పథకాల అమలు ప్రభావం చూపుతుందని పొలిటికల్ కోణం నుంచి బీఆర్ఎస్ ఆందోళన పడుతున్నది.

నిధుల విడుదల కోసం ఆర్థిక శాఖపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది. దీంతో ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం ఆ శాఖ అధికారులకు కత్తిమీద సాములా మారింది. రానున్న ఐదారు నెలల్లో కొత్త పథకాలు లాంఛనంగా ప్రారంభమైనా అర్థంతరంగా ఆగిపోతాయా?.. లేక తూతూ మంత్రంగా మొదలై కొత్త ప్రభుత్వంలోనే గాడిన పడతాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి.

11.5 లక్షల ఎకరాలకు 4 లక్షల ఎకరాలే..

ఈ ఏడాది ఫిబ్రవరి 11న అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలను పంపిణీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు గుర్తించిన భూమి 11.5 లక్షల ఎకరాలు అంటూ చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి చివరి వారం నుంచే పంపిణీ ప్రక్రియ మొదలవుతుందని, అప్పటికల్లా ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ భూములకు రైతుబంధు స్కీమ్‌నూ వర్తింపజేస్తమని ప్రకటించారు.

ఇకపైన పోడు కొట్టబోమంటూ ఆదివాసీ రైతుల నుంచి రాతపూర్వకంగా హామీ తీసుకుంటామని, ఒకవేళ అడవిని నరికినట్లయితే పట్టాలను క్యాన్సిల్ చేస్తామన్నారు. కానీ మార్చి 28న ప్రగతి‌భవన్‌లో జరిగిన సమీక్షా సమావేశం సందర్భంగా నాలుగు లక్షల ఎకరాల భూమిని గుర్తించినట్టు అధికారులు వివరించారు. దాదాపు రెండొంతుల భూమికి పట్టాల పంపిణీ ఉండదనే పరోక్ష సంకేతాన్ని ప్రభుత్వం వెల్లడించింది. పంపిణీ ప్రక్రియ ఎప్పుడు మొదలువుతుందో కూడా స్పష్టత లేకుండాపోయింది.

ఇంటి నిర్మాణ సాయం రూ.3 లక్షలకు కుదింపు

సొంత స్థలం ఉన్న పేద కుటుంబాలు ఇల్లు కట్టుకోడానికి రూ.5-6 లక్షల మేర ప్రభుత్వం తరఫున సాయం చేయనున్నట్టు 2018 ఎన్నికల మేనిఫెస్టోలో (నాల్గవ వాగ్ధానం) బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం దీని పేరును ‘గృహలక్ష్మి’ అనౌన్స్ చేస్తూ.. సాయాన్ని రూ.3 లక్షలకు కుదించింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి సగటున 3 వేల ఇండ్ల చొప్పున రాష్ట్రం మొత్తం మీద సుమారు నాలుగు లక్షల మందికి సాయం అందించనున్నట్టు ప్రకటించింది.

ఇందులో ఎమ్మెల్యేల పరిధిలో 3.57 లక్షల ఇండ్లు ఉంటాయని, మిగిలిన 43 వేల ఇండ్లు సీఎం విచక్షణ మేరకు నిర్వాసితులకు, ప్రమాద బాధితులకు కేటాయించే చాన్స్ ఉంటుందని ఆ బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం పేర్కొన్నది. ఈ అవసరాలతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల స్కీమ్ కోసం రూ.12,000 కోట్లను కేటాయించింది. కానీ ఏడాది దాటినా గృహలక్ష్మి స్కీమ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు సిద్ధం కాలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై స్పష్టత లేదు.

దళితబంధులోనూ కోత

దళితబంధు పథకం విప్లవాత్మకమని అభివర్ణించిన సీఎం కేసీఆర్ అందుకోసం గతేడాది బడ్జెట్‌లో రూ.17,700 కోట్లను కేటాయించారు. కానీ ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఏడాది మొత్తంలో కొత్త లబ్ధిదారుల ఎంపికా జరగలేదు. ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతే మొత్తంలో ఈ పథకానికి బడ్జెట్ కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదలై ఒకటిన్నర నెల దాటినా ఇప్పటికీ ఈ స్కీమ్‌కు నిధులు రిలీజ్ కాలేదు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1500 మంది చొప్పున ఆర్థికసాయం అందుకుంటారని పేర్కొన్నది. కానీ,

ఏడాది మొత్తానికి గరిష్టంగా 500 మందికి మించి ఉండకపోవచ్చని అధికారుల సమాచారం. నిధుల విషయంలోనూ లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగానే వారి ఖాతాలో డబ్బులు జమ అవుతాయని, కానీ యూనిట్లను మంజూరు చేసేంతవరకు ఆ డబ్బులు వారి ఖాతాల్లోనే ఉన్నా ‘ఫ్రీజ్’ మోడ్‌లో ఉంటాయని వివరించారు. ఎన్నికల వరకూ ఇది కంటిన్యూ కావచ్చని, కొత్త ప్రభుత్వంలోనే కదలిక మొదలవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్.. సొంత రాష్ట్రంలో మాత్రం టార్గెట్‌లో మూడో వంతు కంప్లీట్ చేయడం కూడా గగనంగా మారింది.

Also Read: బుల్లెట్ ప్రూఫ్ ఫెసిలిటీ, 24 అవర్స్ సెక్యూరిటీ.. అయినా CM KCR నో విజిట్!


Advertisement

Next Story