అందరి దృష్టి మినీ ఇండియాపైనే.. మల్కాజిగిరిలో బోణీ కొట్టేదెవరు? ఉత్కంఠగా మారిన ఓటరు నాడి

by Prasad Jukanti |
అందరి దృష్టి మినీ ఇండియాపైనే.. మల్కాజిగిరిలో బోణీ కొట్టేదెవరు? ఉత్కంఠగా మారిన ఓటరు నాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల రణరంగం చివరి అంకానికి చేరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల అగ్రనేతలు నిన్నటి వరకు రాష్ట్రాన్ని చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఏ నియోజకవర్గంలో ఓటరు నిర్ణయం ఎలా ఉండబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది. కాగా రాష్ట్రంలో మినీ ఇండియాగా పిలువబడే మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్ల నాడి ఏంటి? వారు ఇవ్వబోయే తీర్పు ఏంటి అనేదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ హాట్ సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఈ మూడుపార్టీల్లో ఎవరు గెలిచినా తొలిసారి పార్లమెంట్‌లోకి అడుగుపెట్టనున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఓటర్ల తీర్పు ఆసక్తిగా ఉండనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ తరఫున మాజీమంత్రి ఈటల రాజేందర్ కోసం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగి రోడ్ షో నిర్వహించడం, సర్వే సంస్థలు ఈటలకే మొగ్గు చూపుతుండటంతో పాటు కులసంఘాలు సైతం ఆయనకే జై కొట్టడంతో మాల్కాజిగిరి పొలిటికల్ సినారియో మరింత రసవత్తరంగా మారింది.

ఈటల వ్యూహాత్మక వైఖరి..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మల్కాజిగిరిని తన యుద్ధక్షేత్రంగా ఎంచుకున్న ఈటల రాజేందర్ మొదటి నుంచి ఇక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఒక్కసారైనా బీజేపీ గెలవని స్థానంలో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం అండగా నిలబడటం, స్వయంగా మోడీ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించడంతో సీన్ మొత్తం మారిపోయింది. రాజేంద్రుడి కోసం నరేంద్రుడే వచ్చాడనే టాక్ ప్రజల్లో సానుకూల చర్చకు దారితీసింది. మరోవైపు ఉద్యమకారుడిగా, మంత్రిగా ఈటలకు ఉన్న పరిచయాలు, ప్రచారంలో ప్రత్యర్థుల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టి ఓటర్లను కన్విన్స్ చేయగలిగారనే చర్చ జరుగుతోంది. కొవిడ్ సమయంలో ఆయన సేవలు, కేంద్రంలో మోడీ చరిష్మా కలగలిపి ప్రత్యర్థులను ఇరుకున పెడుతూ ప్రచారంలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలవడంలో ఈటల సక్సెస్ అయ్యారు. ఈక్రమంలోనే పీపుల్స్ పల్స్ సర్వే, 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థలు సైతం మల్కాజిగిరిలో ఈటల 46.79 శాతం ఓటు షేరుతో బంపర్ విక్టరీ సాధించబోతున్నారని అంచనా వేశాయి.

ఎవరి ధీమా వారిదే..

ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవకపోగా సిట్టింగ్ స్థానంలో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సునీత మహేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. అధికార పార్టీ హోదా తమకు సానుకూలంగా మారుతుందనే ఆశాభావంతో ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ తొలిసారి బొణీ కొట్టి క్లిష్టపరిస్థితుల్లో తన ఉనికిని కాపాడుకోవాలని చూస్తోంది. సెగ్మెంట్ పరిధిలో అందరూ తమ ఎమ్మెల్యేలు ఉండటంతో కలిసి వస్తుందని బీఆఆర్ఎస్ ధీమాతో ఉంది. మరోవైపు ఇక్కడ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతోపాటు పారిశ్రామిక, విద్యా రంగాలకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలు ఉన్నాయి. రైల్వే, మిలిటరీ ఉద్యోగుల‌ు పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరి సమస్యలు కేంద్రం పరిధిలో ఉంటాయని, బీజేపీని గెలిపిస్తే వాటి పరిష్కారం సాధ్యమనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో గెలుపు విషయంలో ఓటర్ల అంతిమ తీర్పు ఎలా ఉండబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.



Next Story