ROR Act 2024: ఆర్వోఆర్ చట్టం ప్రతి ఒక్కరిది

by Praveen Kumar Siramdas |   ( Updated:2024-08-23 14:16:37.0  )
ROR Act 2024: ఆర్వోఆర్ చట్టం ప్రతి ఒక్కరిది
X

ఆర్వోఆర్ చట్టం ప్రతి ఒక్కరిది.

రైతులదే కాదు.. నివాస స్థలాలక్కూడ,భూదార్ నంబర్ అత్యంత కీలకం

సర్వే మ్యాప్ లపై వివాదం అవసరం లేదు.

13 ఏండ్ల తర్వాత కొత్త చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ.

పారాలీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల సేవలు వినియోగించుకోవాలి.

ధరణి కమిటీ సభ్యుడు భూమి సునీల్ తో దిశ స్పెషల్ ఇంటర్వ్యూ.


దిశ, తెలంగాణ బ్యూరో:

రాష్ట్రంలో కొత్త ఆర్వోఆర్ చట్టం రాబోతున్నది. ఇది వ్యవసాయ భూముల కోసమే కాదు. నివాస స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేది. ఇందులో ఆబాదికి కూడా భూదార్ నంబర్ ఇచ్చే ప్రత్యేకాంశాలు ఉన్నాయి. అందుకే ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అర్ధం చేసుకోవాలి. అవగాహన పెంపొందించుకున్నప్పుడే న్యాయం పొందేందుకు మార్గం సుగమమం అవుతుంది. అలాగే ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న ఈ చట్టంపై అభిప్రాయాలను కూడా వెల్లడించే అవకాశం కల్పించింది. 13 ఏండ్ల తర్వాత ఓ చట్టంపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. కొత్త చట్టం అవసరం ఏమొచ్చింది? పాత చట్టానికే సవరణ చేయొచ్చు కదా? అప్పీల్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి? సర్వే మ్యాప్ సాధ్యమవుతుందా? అనేక సందేహాలను లేవనెత్తుతున్న నేపధ్యంలో ఆర్వోఆర్ 2024 ముసాయిదాను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ చట్టాల నిపుణుడు, ధరణి కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ తో ‘దిశ’ ప్రత్యేక ఇంటర్వ్యూ. సామాన్యులకు ఉచితంగా , సత్వర సేవలు అందాలన్నదే తన ఉద్దేశ్యమన్నారు. ఈ చట్టంపై ఎంత చర్చ జరిగితే అంత మంచిదన్నారు.

ప్రశ్న: ఈ చట్టం అవసరం ఎందుకొచ్చింది?

ధరణి పోర్టల్, ఆర్వోఆర్ 2020 ద్వారా ఎన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలుసు. ఇప్పటికే 20 లక్షల మంది తమ రికార్డులు సరి చేయాలంటూ అప్లై చేసుకున్నారు. ఇంకా లక్షలాది మంది సమస్యలకు ఇప్పుడున్న చట్టంలో మార్గమే లేదు. ఆఖరికి సాదాబైనామా కింద రెగ్యులరైజ్ చేయాలంటూ 9 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే పరిష్కరించే మార్గమే లేదు. అసలు ఏ అధికారి దగ్గరైనా న్యాయం దక్కకుంటే ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్లే అప్పీల్ వ్యవస్థే లేదు. కోర్టుకే వెళ్లాలంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. సామాన్యుడికి న్యాయం దక్కే వ్యవస్థ ఉండాలి. అలాంటి చట్టం తీసుకురావాలన్నదే లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పేద రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్న ధ్యేయంతో ఉన్నారు. అది కొత్త చట్టం ద్వారానే సాధ్యం.

ప్రశ్న: కొత్త చట్టానికి, పాత చట్టానికి తేడా ఏంటి?

ఇందులో సామాన్యుడికి న్యాయం పొందే మార్గం ఉంటుంది. అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. కింది స్థాయిలోనే న్యాయం పొందే వీలుంటుంది. అప్పీల్ వ్యవస్థ ఉంటుంది. చిక్కుల్లేని రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఉంటాయి. సీసీఎల్ఏ దాకా రావాల్సిన అవసరం లేని వ్యవస్థ ఏర్పడుతుంది. ప్రతి కమతానికి భూదార్ నంబర్ వస్తుంది.

ప్రశ్న: ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు?

పాలకులు ఏ చట్టం తీసుకొచ్చినా ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి. ప్రజల నుంచి వారికేం కావాలో తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా అదే చేయాలి. దురదృష్టవశాత్తు కొంత కాలంగా ప్రజలకు తెలియకుండానే కొందరు కూర్చొని తయారు చేసి అమల్లోకి తీసుకురావడం వల్ల ఈ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ చట్టం ఎవరికి అవసరమే వారి దాకా చేర్చాలి. అప్పుడే రెండు లాభాలు ఉంటాయి. ఒకటేమో ఈ చట్టంపై అవగాహన కలుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా ఇంకేమైనా మార్పులు అవసరమోమో గుర్తించగలుగుతుంది. ఆ తర్వాత అమలు కూడా ఈజీ అవుతుంది.

ప్రశ్న: సేల్ డీడ్స్ లో సర్వే మ్యాప్ అంటున్నారు. సాధ్యమేనా? ఇప్పుడు అప్లూ చేస్తే మూడు నెలలు పడుతుంది కదా!

ఇది చిక్కుల్లేని వ్యవస్థను రూపొందించడానికే. చాలా మందికి ఈ డౌట్ వస్తుంది. సర్వేయర్లు లేరు కదా అని.. కర్నాటకలో ఏం చేస్తున్నారో ఇక్కడా అదే చేయొచ్చు. ఇది తెలంగాణలో కొత్త కూడా కాదు. 1948 ఆర్వోఆర్ యాక్ట్ లోనూ ఉంది. కొంత కాలానికి అది తీసేశారు. ఐతే మండల సర్వేయర్లే ఇది చేయాలని ఎక్కడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా లైసెన్స్డ్ సర్వేయర్లు ఉన్నారు. వారికి బాధ్యతలు అప్పగించడం ద్వారా మేలు కలుగుతుంది. వారికి కూడా ఉపాధి లభిస్తుంది. కొనుగోలు చేసే వ్యక్తికి హద్దులు నిర్దిష్టంగా తెలుస్తాయి. సర్వే చేసేటప్పుడు ఏవైనా వివాదాలు ఉన్నా అర్ధమవుతాయి. భవిష్యత్తులోనూ సమస్యలు రాకుండా నియంత్రిస్తుంది. ఇది చట్టం అమలైన వెంటనే మొదలవుతుందని కాదు. దానికి ప్రిస్కైబుడ్ డేట్ ఉంటుంది.

ప్రశ్న: పారా లీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థ పాత్ర ఏంటి?

రెవెన్యూ చట్టాల మీద చాలా మందికి అవగాహన లేదు. ప్రజలకు ఈ చట్టాలపై ఎంత నాలెడ్జ్ ఉంటే అంత మేలు కలుగుతుంది. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పారాలీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్లను వినియోగించుకోవచ్చు. వారికి పదేండ్ల అనుభవం ఉంది. ఇప్పుడు వారిని గ్రామీణాభివృద్ధి శాఖలో పని చేయిస్తున్నారు.

ప్రశ్న: కొత్త చట్టంలో వారికి అవకాశం ఉందా?

కొత్త చట్టం అమల్లోకి తీసుకురావడానికి, అందులోని అనేకాంశాలపై హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు అనివార్యం. ఇందు కోసం వీటిపై అవగాహన ఉన్న వారిని నియమించుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి సూచన. ఈ వ్యవస్థను అనేక దేశాలు ప్రశంసించాయి. సామాన్యులకు ఉచితంగా న్యాయం, పౌర సేవలందించేందుకు వీలు కలుగుతుంది. పేదలకు రెవెన్యూ సేవలను ఉచితంగా అందించే వ్యవస్థ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్లో అమలు చేస్తున్నారు. వాటి ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో పారా లీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. దురదృష్టవశాత్తు 2014 నుంచి ఆ వ్యవస్థ రద్దయ్యింది. ఇప్పుడు ఆర్వోఆర్ 2024లో మానవ వనరుల అవసరం ఎక్కువని, పేదలకు న్యాయం చేయాలంటే వీరి అవసరం ఎంతో ఉంది. వీరందరినీ రెవెన్యూ శాఖలో విధులు కేటాయించడం ద్వారా గ్రామీణ పేదలకు సత్వర సేవలందించేందుకు వీలవుతుంది. ఈ పారా లీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను అప్పటి చీఫ్ జస్టిస్ సింఘ్వి, సీనియర్ ఐఏఎస్ అధికారులు కొప్పుల రాజు, టి.విజయ్ లు కొనియాడారు. అలాగే ప్రపంచ దేశాలెన్నో ఇక్కడీ వ్యవస్థను స్టడీ చేసి అమలు చేస్తున్నారు. ఎలాగూ ప్రతి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నందున చట్టాల మీద అవగాహన కలిగిన వీరిని ఎంపిక చేయడం వల్ల న్యాయం జరుగుతుంది.

ప్రశ్న: అప్పీల్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయట!

ప్రధానంగా ఆర్డీవోకూ అప్పీల్ చేసుకునే వ్యవస్థ రావాలన్న సూచనలు వస్తున్నాయి. ఐతే మ్యుటేషన్లు, కొన్ని బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించారు. వారి నుంచి అప్పీల్ వ్యవస్థ మొదలెట్లా పెడతారు. అందుకే అదనపు కలెక్టర్/కలెక్టర్ నుంచి మొదలవుతుంది. ఒక వేళ ప్రభుత్వం ఆర్డీవో నుంచే అప్పీల్ వ్యవస్థ అనుకుంటే మార్చుకోవచ్చు. అభ్యంతరం ఏం లేదు.

ప్రశ్న: కొత్తగా భూదార్ ఎందుకు? దేశంలో మరెక్కడా లేదు కదా!

అవును. తెలంగాణలో ఈ విధానం అమలు కానున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను అందుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతి కమతానికి సరైన గుర్తింపు, కో ఆర్డినేట్స్ ఉండడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ పెరుగుతుంది. దాని వల్ల విలువ పెరుగుతుంది. రైతుకు వివాదాల్లేని భూమి హక్కులు దక్కుతాయి.

ప్రశ్న: ఇప్పటికిప్పుడు భూదార్ నంబర్ ఇచ్చే వ్యవస్థ ఉందా?

లేదు కావచ్చు. కానీ చట్టంలో కూడా అమలైన వెంటనే నంబర్లు ఇవ్వాలని లేదు. చట్టంలో ఈ అంశంపై ఇచ్చే గైడ్ లైన్స్ రూపకల్పన, అమలు చేసే తేదీని బట్టి మొదలవుతుంది. అందుకే నిర్దిష్ట సమయం నుంచి అని చట్టంలో పేర్కొన్నాం. ప్రభుత్వం అందుకు సంబంధించిన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాతే భూదార్ నంబర్ల జారీ ప్రక్రియ మొదలవుతుంది.

ప్రశ్న: జిల్లా స్థాయి సదస్సుల నుంచి మీరు కోరుకుంటున్నది ఏంటి?

కొత్త చట్టం తీసుకొచ్చే ముందు 13 సంవత్సరాల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. గతంలో చాలా ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండానే అమలు చేసేవి. అందుకే ఈ చట్టంలో ఏం ఉంది? మనకు ఉపయోగపడుతుందా? లేదా? ఇంకేం ఉంటే బాగుంటుంది? అనేది చూడాలి. ప్రతి ఒక్కరికీ ఈ చట్టంపై కనీస అవగాహన ఉండాలి. 23, 24 తేదీల్లో జిల్లాల్లో నిర్వహించే సదస్సుకు రైతులు, నాయకులు, మేధావులు, రెవెన్యూ రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత అధికారులంతా హాజరై వారి అభిప్రాయాలను చెప్పాలి. అప్పుడే సమగ్ర ఆర్వోఆర్ చట్టం రూపొందించడానికి అవకాశం ఏర్పడుతుంది.

ప్రశ్న: ఈ చట్టం ఎవరికి అవసరం?

గతంలో ఆర్వోఆర్ యాక్ట్ అంటే భూమి ఉన్న వారికి మాత్రమే. కానీ ఇప్పుడు ఇంటి స్థలం, ఇల్లు ఉన్న వారికి కూడా అవసరమే. ఆబాది అంటే నివాస స్థలాలకు కూడా భూదార్ నంబర్ ఇవ్వాలన్న ప్రతిపాదన ఉంది. దీని ద్వారా మేలు కలుగుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ చట్టంపై అవగాహన ఉండాలి. అప్పుడే న్యాయం పొందే మార్గం సుగమమం అవుతుంది.

ప్రశ్న: ఈ చట్టం ఎప్పటి వరకు అమల్లోకి రావచ్చు?

జిల్లా స్థాయి సదస్సుల ద్వారా వచ్చిన అభిప్రాయాలను క్రోఢీకరించుకోవాలి. ఆ తర్వాత ముసాయిదా చట్టంలో మార్పులు తీసుకురావాలి. దాన్ని రెవెన్యూ మంత్రి, సీఎం ఆమోదించాలి. ఆ తర్వాత కేబినేట్లోనూ చర్చించాలి. అసెంబ్లీ సమావేశాలు పెట్టాలి. అక్కడా ఆమోదించాలి. గవర్నర్ కూడా ఆమోదముద్ర వేసిన తర్వాత అమల్లోకి వస్తుంది. ఐతే అమల్లోకి రాగానే ఇందులోని ప్రతి అంశంపై పని చేయడం కుదరదు. గతంలో ఆర్వోఆర్ 2020 కి మార్గదర్శకాలు రిలీజ్ చేయకుండానే అమలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడది కుదరదు. ప్రతి అంశంపైనా ఎలా పని చేయాలన్న దానికి మార్గదర్శకాలు రిలీజ్ చేయాలి. అప్పుడే చట్టం పరిధిలో పనులు మొదలవుతాయి.

E Paper : https://epaper.dishadaily.com/3908044/TS-Main/23-08-2024#page/7

Advertisement

Next Story

Most Viewed