మండు వేసవిలో సైతం మత్తడులు దుంకుతున్నా నీళ్లు: మంత్రి హరీష్ రావు

by Kalyani |
మండు వేసవిలో సైతం మత్తడులు దుంకుతున్నా నీళ్లు: మంత్రి హరీష్ రావు
X

దిశ, చేగుంట: మండు వేసవిలో కూడా నీళ్లు మత్తడులు దుంకుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. చేగుంట మండలం బోనాల -ఇబ్రహీంపూర్ వద్ద రామాయంపేట కెనాల్ లో కొండపోచమ్మ సాగర్ నుంచి వచ్చిన గోదావరి జలాలకు పూజలు నిర్వహించారు. అలాగే నిజాంపేట మండలం నార్లాపూర్ వద్ద బొల్లికుంట చెరువులోకి గోదావరి జలాలను వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి మాట్లాడుతూ పంటలు పండించేందుకు నీటి కోసం రైతులు ఆకాశం వైపు చూసే అవసరం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేశ్వరం జలాలను తాగడానికి, సాగుకు అందిస్తున్నారని అన్నారు.


కరీంనగర్ జిల్లాలోని మేటిగడ్డ నుంచి 530 మీటర్ల ఎత్తున గోదావరి జలాలను ఎత్తిపోస్తూ 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లాపూర్ కు నీటిని తీసుకొచ్చామని అన్నారు. ఇక బోర్లు, బావులలో ఊట పెరుగుతుందని, ఎప్పుడు కాల్వలో నీటి ప్రవాహం ఉంటుందని, చెరువులు, కుంటలు నింపుకోవడం ద్వారా రెండు పంటలు పండించుకోవచ్చని అన్నారు. రైతులు 365 రోజులు కడుపునిండా తినవచ్చన్నారు. ఆనాడు సాగునీటికి, తాగునీటికి గోస ఉండేదని, విద్యుత్ కోతలతో రైతులు పంటలు పండించాలంటే పెట్టుబడి రాదేమోనని కళ్ళల్లో నీళ్లు తిరిగేవన్నారు. కానీ నేడు రైతుబంధు, రైతు బీమా, సకాలంలో ఎరువులు, సాగునీరు, ఉచిత విద్యుత్ తో పాటు ప్రతి గింజను కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా రైతులకు భరోసా ఇస్తున్నదని, రైతులు కార్లలో తిరిగే రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సంపద సృష్టించి అందరికి పంచుతుంటే కేంద్రం నిందలు వేస్తున్నదన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం ఆసరా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అందిస్తున్నదని, వచ్చే ఉగాది అనంతరం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అమలు చేయన్నామని ఆయన తెలిపారు. సొంత జాగా ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డి ధర్మారంలో నిజాంపేటలో మహిళా భవనం నిర్మాణానికి మంజూరు నిధులు చేశారు.

అంతకుముందు మంత్రి రామాయంపేట మండలం ధర్మారంలో మూడు కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ను, మన ఊరి మనబడిలో భాగంగా రూ. 80 లక్షలతో జిల్లా పరిషత్ హైస్కూల్ రెనోవేషన్, అదనపు తరగతి గదులను ప్రారంభించారు. రూ. కోటి 50 లక్షలు వ్యయంతో ఊర చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, రాజశేఖర్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed