కేంద్రం సహకరించకున్నా విద్యలో తెలంగాణ అగ్రగామే : MLC Kavitha Kalvakuntla

by Nagaya |   ( Updated:2022-12-27 14:13:35.0  )
కేంద్రం సహకరించకున్నా విద్యలో తెలంగాణ అగ్రగామే : MLC Kavitha Kalvakuntla
X

దిశ, తెలంగాణ బ్యూరో : 8 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కేంద్రం సహకరించకున్న విద్యా వ్యవస్థలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని స్పష్టం చేశారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. బాలికల విద్యకు తెలంగాణ స్వర్ణ యుగంగా మారిందని, పీజీలో 72శాతం, డిగ్రీలో 52శాతం, గురుకులాలు, కేజీబీవీల్లో 69శాతం, బీఈడీ ఫస్టియర్‌లో 81శాతం బాలికల అడ్మిషన్లతో, ఉన్నత విద్యలో బాలికల ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో జాతీయ సగటును మించి తెలంగాణ ఫలితాలను సాధిస్తున్నదని సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కేటాయింపులో తెలంగాణ పట్ల పూర్తి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా, వైద్య విద్యలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కొత్త విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనతో, ఉన్నత విద్యలో బాలికలు పెద్ద ఎత్తున చేరుతుండటం గర్వకారణం, సంతోషకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్ సీట్లు కల్పించి దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిందని స్పష్టం చేశారు. సమాన అవకాశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి మెడికల్ సీట్లను పెంచిందన్నారు. ఏ మాత్రం కేంద్ర ప్రభుత్వం మద్దతు లేకున్నా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఆమోదయోగ్యమైన అత్యుత్తమ పాలన అందించాలన్న కేసీఆర్ చిత్తశుద్ది చెప్పుకోతగిందన్నారు.

Advertisement

Next Story