బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ప్రచారం.. అమిత్ షాతో ఈటల భేటీ

by Prasad Jukanti |
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మార్పు ప్రచారం.. అమిత్ షాతో ఈటల భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో:లోక్ సభ ఎన్నికలు ముగిసినా తెలంగాణలో రాజకీయ వేడి తగ్గలేదు. సార్వత్రిక ఎన్నికల్లో 8 స్థానాల్లో జెండా పాతిన బీజేపీ నెక్స్ట్ స్టేట్ పాలిటిక్స్ లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కడంతో ఆయన బాధ్యతలను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో భేటీ కావడం ప్రధాన్యత ఏర్పడింది. సోమవారం ఢిల్లీలో అమిత్ షా తో ఈటల మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దీంతో మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఈటల చేతికి రాబోతున్నాయనే ప్రచారం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

అధిష్టానందే ఫైనల్ డెసిషన్:

ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. ఈ విషయాన్ని తానెలా చెప్పగలను, తనకు అధ్యక్షత బాధ్యతలు అనే విషయం పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదే అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి సౌత్ ఇండియాలో తెలంగాణ గేట్ వే ఉందని, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించిందన్నారు. 2019లో 4 ఎంపీ స్థానాలు ఉండగా 2024లో 8 స్థానాలకు ఎదిగామన్నారు. తమకు ఓటు పర్సంటేజీ శాతం కూడా 35 శాతం వచ్చిందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం సంతోషంగా ఉందన్నారు.

గర్వంగా ఉంది:

దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గమైన మల్కాజ్ గిరి నుండి దాదాపు నాలుగు లక్షల మెజారిటీతో నన్ను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాష్ట్రంలో మంత్రిగా కొనసాగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోదీ నాయకత్వంలో లోక్‌సభలో ఎంపీగా కొనసాగడం నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఒకటే పార్టీ ఒక్కరే మూడోసారి ప్రధానమంత్రి కావటం అనేది ఒక చరిత్ర అని, 1962 తర్వాత మూడవ సారి ఒకే పార్టీ నుండి ఒకే వ్యక్తి ప్రధాని కావడం చాలా అరుదైన విషయమని గుర్తు చేశారు. యావత్తు దేశ ప్రజలు తమ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేశారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ 2014లో, 2019లో చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడవసారి కూడా అధికారం అప్పజెప్పారని. గత పదేళ్లలో చేసిన అభివృద్ధి కంటే రెట్టింపు అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం గొప్ప విషయం అన్నారు.

Advertisement

Next Story