మళ్లీ బీఆర్ఎస్‌లో చేరికపై ఈటల రాజేందర్ క్లారిటీ

by GSrikanth |   ( Updated:2023-02-12 15:40:32.0  )
మళ్లీ బీఆర్ఎస్‌లో చేరికపై ఈటల రాజేందర్ క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని, బీఆర్ఎస్‌లోకి తనను పిలిచినా వెళ్లేది లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పేరును పదే పదే ప్రస్తావించడంపై ఆయన స్పందించారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్‌లో ఆదివారం ఈటల మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పేరును పదే పదే ప్రస్తావించడం వల్ల తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు. తాను పార్టీ మారలేదని, తనను గెంటివేశారని, తిరిగి పిలిచినా వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ మెతక మాటలకు పడిపోయే వ్యక్తిని కాదని క్లారిటీ ఇచ్చారు.

2004లో కూడా వైఎస్‌తో కలుస్తారని, ఆపరేషన్ ఆకర్ష్ లిస్టులో ఉన్నాడని తన గురించి వ్యాఖ్యానించారని, కానీ తాను ఆనాడూ పార్టీ మారలేదు. ఇప్పుడూ పార్టీ మారబోయేది లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన దాడులు, పెట్టిన ఇబ్బంది తాను, ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. పలకరించుకుంటే, పక్కన కూర్చుంటే పార్టీలు మారే వ్యక్తి ఈటల కాదని కేసీఆర్‌కు చురకలంటించారు. పార్టీలు మార్చే కల్చర్ తనది కాదని వెల్లడించారు. అసలు తాను పార్టీ వీడలేదని, వారే తనను బయటకు పంపించేశారని ఈటల తెలిపారు.

సీఎం కేసీఆర్ తన స్టైల్‌లో మాట్లాడారని, భట్టి, అక్బరుద్దీన్ ఒవైసీ, జగ్గారెడ్డి పేరును కూడా ఆయన అలానే పిలుస్తారని పేర్కొన్నారు. తాను అసెంబ్లీకి వచ్చింది ప్రజా సమస్యలపై చర్చ కోసమన్నారు. తాను తన సొంత ఎజెండా కోసం అసెంబ్లీకి రాలేదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పిలిస్తే కచ్చితంగా వెళ్లి సలహా ఇస్తానని ఆయన స్పష్టంచేశారు. తాను బీజేపీలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు.

ఇదిలా ఉండగా 20 ఏండ్ల రాజకీయ జీవితంలో బడ్జెట్ సమావేశాలు ఇంత తక్కువ పనిదినాలు ఎన్నడూ జరగలేదని అన్నారు. ఒక్కో రోజు ఒక్కో పద్దుపై చర్చలు జరిగేవన్నారు. బిల్లులు రాక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. సభలో ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి ఉండాలని, కానీ అది లేకుండా పోయిందన్నారు. మందబలం ఉందని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవమానించడం, తిట్టడమే టార్గెట్‌గా సాగిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు సభలో చెప్పింది ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

బడ్జెట్ లెక్కలు తప్పుల తడకగా ఉన్నాయన్నారు. బడ్జెట్ రూ.2.90 లక్షల కోట్ల నిధులు బక్వాస్ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశ రాజకీయాలంటున్నాడని, అసలు వారు తెలంగాణలో గెలిస్తే కదా దేశ రాజకీయాలకు వెళ్లేదని ఈటల చురకలంటించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ రెడీగా ఉందని, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed